
స్కావెంజర్ల పెండింగ్ వేతనాలు చెల్లించాలి
ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో స్కావెంజర్లుగా పనిచేస్తున్న వర్కర్లకు 8 నెలల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి కలెక్టర్ దివాకరకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రభత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో స్కావెంజర్లను 2024 అక్టోబర్‌లో నియమించినట్లు తెలిపారు. 8 నెలలుగా పనిచేస్తున్నా వీరికి వేతనాలు చెల్లించకపోవడంతో కుటుంబం గడవటమే కష్టంగా మారిందని తెలిపారు. స్కావెంజర్లను ప్రభుత్వం కార్మికులుగా గుర్తించి గుర్తింపు కార్డులను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కావెంజర్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు యన్నమల్ల ప్రవీణ్‌కుమార్. జనగాం రమేష్, నవీన్, మల్లికార్జున్, ఉమా, సమ్మయ్య, కమలమ్మ తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్