
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా థియేటర్లలోకి వచ్చిన కన్నప్ప బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. మొదటి రోజు రూ. 9.35 కోట్ల నికర వసూళ్లు సాధించింది. అయితే రెండో రోజు రూ.7 కోట్లకు పైగా రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో రెండు రోజుల్లో కలిపి ఇండియా వ్యాప్తంగా రూ. 16.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటించారు.
కాగా.. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. రాబోయే రోజుల్లోనూ ఇదే జోరు కొనసాగితే విష్ణు మంచు కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా కన్నప్ప నిలవనుంది. గతంలో మంచు విష్ణు చిత్రాలైన జిన్నా, మోసగాళ్లు సినిమాలకు చాలా తక్కువ వసూళ్లు వచ్చాయి. ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో మెప్పించగా.. మంచు విష్ణు తిన్నడు పాత్రలో ఆకట్టుకున్నారు. ఈ మూవీలో విష్ణు సరసన ప్రీతి ముకుందన్ కనిపించింది. అంతేకాకుండా మోహన్ బాబు, అర్పిత్ రంకా, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, శివ బాలాజీ, కౌశల్ మంద, రాహుల్ మాధవ్, దేవరాజ్, ముఖేష్ రిషి, రఘు బాబు, మధు కీలక పాత్రల్లో నటించారు.