
జయాపజయాలు సహజం. దీనికి ఎవరూ అతీతులు కాదు. ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన నటుడు కమలహాసన్ అయినా, మరచిపోలేని చిత్రాలను అందించిన దర్శకుడు మణిరత్నం అయినా సరే. నటుడు కమలహాసన్ ఇటీవల కథానాయకుడిగా విక్రమ్, నిర్మాతగా అమరన్ వంటి సంచలన విజయాలను సాధించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఎంజీఆర్ వంటి ప్రఖ్యాత నటుడు చేయాలని ఆశించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని దర్శకుడు మణిరత్నం తెరకెక్కించి సక్సెస్‌ను సాధించారు. అలాంటిది ఇటీవల ఈయన దర్శకత్వం వహించిన థగ్‌లైఫ్ చిత్రం నిరాశ పరిచింది. అదేవిధంగా హీరో కమలహాసన్(Kamal Haasan )కు థగ్‌లైఫ్‌తో పాటూ ఇండియన్– 2 చిత్రం పరాజయాలను చవి చూశాయి.
అయితే ఇదంతా పట్టించుకోని మణిరత్నం ప్రస్తుతం ఒక యూత్ పుల్ లవ్ స్టోరీని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ఇక కమలహాసన్ స్టంట్ మాస్టర్స్ అన్భరివ్‌లను దర్శకులుగా పరిచయం చేస్తూ భారీ చిత్రాన్ని నిర్మిస్తూ , కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కమలహాసన్ వారసురాలు, నటి శృతిహాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి మనస్థత్వం గురించి పేర్కొన్నారు.
థగ్‌లైఫ్ చిత్ర అపజయం అనంతరం కమలహాసన్ మానసిక పరిస్థితి ఎలా ఉందన్న ప్రశ్నకు శ్రుతిహాసన్ బదులిస్తూ ఆ చిత్ర అపజయం తన తండ్రిని ఎలాంటి బాధింపునకూ గురి చేయలేదన్నారు. ఆయన ఎప్పుడూ సంపాదించిన తన డబ్బునంతా మళ్లీ సినిమాల్లోనే పెడతారన్నారు. ఆయన ఆ డబ్బుతో రెండో ఇల్లు కొనడానికో, మూడో కారు కొనడానికో ఇష్టపడరన్నారు. అంతా సినిమాలకే పోతుందన్నారు.
ప్రజలు అనుకుంటున్నట్లు ఈ నెంబర్ గేమ్ అనేది తన తండ్రిని బాధించదని శృతిహాసన్ పేర్కొన్నారు. కాగా ఇటీవల నటించిన కూలీ చిత్రంలోని నటనకు గానూ శ్రుతిహాసన్ ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం విజయ్‌సేతుపతికి జంటగా ట్రెయిన్ చిత్రంలో నటిస్తున్న ఈ బ్యూటీ తెలుగులో ఒక చిత్రం చేస్తున్నారు. కాగా తాజాగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న మరో తెలుగు చిత్రంలో శృతిహాసన్ నటించనున్నట్లు తాజా సమాచారం.