అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్‌పై పబ్లిక్‌ రెస్పాన్స్‌ ఇదే | Atal Bihari Biopic Main Atal Hoon 2024 Movie Review In Telugu, Public Response, And Twitter Reviews - Sakshi
Sakshi News home page

Main Atal Hoon Movie Review: అటల్ బిహారీ వాజ్‌పేయి బయోపిక్‌పై పబ్లిక్‌ రెస్పాన్స్‌ ఇదే

Published Sat, Jan 20 2024 12:07 PM

Main Atal Hoon Movie Review And Public Response - Sakshi

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి బయోపిక్ (Main Atal Hoon) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రవి జాదవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 'మే అటల్ హూ' అనే పేరుతో థియేటర్లలోకి వచ్చింది. బాలీవుడ్‌లో టాప్‌ యాక్టర్‌గా కొనసాగుతున్న పంకజ్ త్రిపాఠి అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రకు జీవం పోశారని సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. ఈ చిత్రంలో అటల్ బిహారీ వాజపేయి జీవితం గురించి ఉన్నది ఉన్నట్లు చూపించారని రివ్యూలు వస్తున్నాయి. ఆయన పాత్రలో త్రిపాఠి జీవించేశారని తెలుస్తోంది.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో నెటిజన్లు సినిమాపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వినియోగదారులు త్రిపాఠి, టీమ్‌ను తెరపై లెజెండరీ లీడర్‌గా చూపించినందుకు ప్రశంసించారు. సినిమాపై ప్రశంసలు కురిపించిన ఓ సోషల్ మీడియా యూజర్ పంకజ్ త్రిపాఠి నటన అద్భుతం అని అన్నారు.‘మే అటల్ హూ, అందరూ తప్పక చూడాల్సిన సినిమా’ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ సినిమాపై ప్రశంసలు కురిపించిన ఓ నెటిజన్ ఈ చిత్రం అందరి హృదయాలను గెలుచుకుంది. అటల్ బిహారీ వాజ్‌పేయిని తెరపై చూపించడం అంత ఈజీ కాదని రాశారు.

పంకజ్ త్రిపాఠి తన అద్భుతమైన నటనతో మరోసారి సినీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారని ఆయన నటనకు విస్మయం చెందానని ఒకరు పేర్కొన్నారు. ‘మే అటల్ హూ – పంకజ్ త్రిపాఠి కెరీర్‌లో ఇప్పటివరకు బెస్ట్ ఫిల్మ్ అని మరొకరు వ్యాఖ్యానించారు. ఈ చిత్రానికి రవి జాదవ్ దర్శకత్వం వహించారు. వాజ్‌పేయి జీవితం, రాజకీయాల ఆధారంగా 137 నిమిషాల నిడివిగల ఈ చిత్రం పాకిస్తాన్‌తో కార్గిల్ యుద్ధం, పోఖ్రాన్ అణు పరీక్షలతో సహా కొన్ని అత్యంత క్లిష్టమైన సమయాల్లో భారతదేశాన్ని నడిపించడంలో అటల్‌ పాత్రను వర్ణిస్తుంది. వ్యక్తిగత తగాదాలు, కుటుంబ సమస్యలు కూడా బయటపడ్డాయి. అలాగే,  సాహిత్యంపై ఆయనకున్న మక్కువను ఈ చిత్రం ఎత్తిచూపింది.

దేశానికి అటల్‌ చేసిన సేవలు తెరపై అద్భుతంగా చూపించారని ఒక నెటిజన్‌ పేర్కొన్నాడు. ఒక రాజనీతిజ్ఞుడిగా భారతదేశానికి అటల్‌ చేసిన త్యాగాలను కూడా మెయిన్ అటల్ హూన్‌లో కనిపిస్తాయి. ఈ సినిమా స్క్రీన్‌ప్లే చలించేలా ఉందని.. ఇందులో దర్శకుడి పనితీరును ఎవరైనా మెచ్చుకోవాల్సిందే అని తెలుపుతున్నారు. కానీ ఫస్ట్‌ హాఫ్‌ మాత్రం చాలా నెమ్మదిగా కథ నడుస్తుంది.. దానిని మీరు తట్టుకోగలిగితే సెకండ్‌ హాఫ్‌ మాత్రం చాలా ఉత్కంఠతతో కొనసాగుతుందని కొందరు తెలుపుతున్నారు. ఇదొక విజువల్ ట్రీట్ అని పలు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి. 

చిత్రంలోని మొదటి భాగంలో వచ్చే  డైలాగ్‌లు అంతగా ఆకట్టుకోలేదు కానీ ఇంటర్వెల్‌ నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిజమైన పరాక్రమాన్ని వర్ణిస్తుందని నెటిజన్లు పేర్కొన్నారు. అయోధ్యను రామజన్మభూమిగా ప్రకటించాలనే అంశాలు, ఉద్యమాలు ఇందులో కనిపిస్తాయి. అరుదైన రాజకీయ మేధావిగా ప్రసిద్ధి. అటల్ బిహారీ వాజ్‌పేయి కవిగా, రాజకీయవేత్తగా, మానవతావాదిగా పేరుపొందారు. వాజ్‌పాయ్ బీజేపీని ప్రభావితం చేసిన నాయకులలో ఒకరు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. దేశ పదవ ప్రధానిగా అటల్ బిహారీ వాజపేయి ప్రమాణ స్వీకారం చేశారు.

Advertisement
 
Advertisement
 
Advertisement