పల్లెపోరుపై నిఘా
మెదక్‌జోన్: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ గట్టినిఘా పెట్టింది. మొదటి విడత నామినేషన్లు ముగిసి, 2వ విడత నామినేషన్లు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు కట్టుదిట్టం చేశారు. పోలీసుల అనుమతి లేనిదే ఎలాంటి కార్యక్రమం నిర్వహించరాదని ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులు తప్పనిసరి అని ఇప్పటికే అన్ని పార్టీల నేతలకు అవగాహన కల్పించారు. జిల్లాలో 38 లైసెన్స్ తుపాకులు ఉండగా వాటిని డిపాజిట్ చేసుకున్నారు. గతంలో జరగిన ఎన్నికల్లో గొడవలు సృష్టించిన వ్యక్తులను, పాత నేరస్తులను, మాజీ నక్సలైట్లను, రౌడీషీటర్లతో కలిపి ఇప్పటి వరకు మొత్తం 231 మందిని ఆయా మండలాల తహసీల్దార్ల వద్ద బైండోవర్ చేశారు. ఈ సంఖ్యా మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
బెల్టుషాపులపై దాడులు
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో బెల్టుషాపులపై గట్టినిఘా పెట్టిన పోలీసులు ఇప్పటి వరకు 113 కేసులు నమోదు చేశారు. రూ. 6.62 లక్షల విలువ చేసే 943 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంతే కాకుండా స్టాటిక్ సర్వేలైన్‌టీం నిరంతరంగా తిరుగుతోంది. అందులో ఎన్నికల అధికారులతో పాటు పోలీస్ అధికారులు ఉన్నారు. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం రూ.50 వేలు మించి తరలించారాదు. ఒక వేళ తరలిస్తే అందుకు సంబంధించి సరైనా ఆదారాలు చూపించాల్సి ఉంటుంది. చూపించకుంటే నగదును స్వాదీనం చేసుని వాటిని కలెక్టరేట్‌లో డిపాజిట్ చేస్తున్నారు.
అతి సమస్యాత్మక జీపీలు
జిల్లా వ్యాప్తంగా 492 గ్రామ పంచాయతీలు ఉన్నా యి. వాటిలో 45 గ్రామాలు అతి సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించారు. వీటివద్ద ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కలెక్టరేట్‌కు అనుసంధానం చేశారు. అలాగే సర్వేలైన్స్‌టీం, వెబ్‌కాస్టింగ్ నిరంతరంగా నిఘా పెట్టడంతో పాటు ఆయా గ్రామాల్లో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలి. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలి. ఎన్నికల నియమావళిని విస్మరిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించం. అలాంటి వారిపై శాఖపరమైనా చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్‌రావు, ఎస్పీ
లైసెన్స్ తుపాకులు స్వాధీనం
231మంది బైండోవర్
45 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు
113 మందిపై కేసులు నమోదు
నిరంతర పర్యవేక్షణలో స్టాటిక్ సర్వేలైన్ టీం


