కోడ్ అతిక్రమిస్తే కొరడా
● ఎస్పీ డీవీ శ్రీనివాస రావు హెచ్చరిక
● ఎన్నికల నియమావళి పాటించాలి
● సమస్యాత్మక ప్రాంత ప్రజలతో భేటీ
టేక్మాల్(మెదక్)/పాపన్నపేట(మెదక్): ఎన్నికల కోడ్‌ను అతిక్రమిస్తే ఉపేక్షించేదిలేదని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో మంగళవారం టేక్మాల్ మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన శాబాద్ తండా, సీఎం తండా, ఎల్లుపేట్, ఎల్పుగొండ, కమ్మరికత, సూరంపల్లికి చెందిన ప్రజలకు శాబాద్‌తండాలో, అలాగే.. పాపన్నపేట మండల పరిధిలోని కొత్తపల్లిలో వేర్వేరుగా సమావేశమై మాట్లాడారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఓటరు ఎన్నికల నియమావళికి లోబడి నడుచుకోవాలని సూచించారు. ఎలాంటి విభేదాలు, వర్గపోరు సృష్టించకూడదన్నారు. ఓటు హక్కును ప్రశాంతంగా, స్వేచ్ఛగా వినియోగించుకోవాలని సూచించారు. గత ఎన్నికల్లో గొడవలకు కారణమైన వారిని ఇప్పటికే బైండోవర్ చేశామని వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరిగి ఇలాంటి ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించవద్దని చెప్పారు.ఎన్నికల్లో డబ్బులు, మద్యం పంపిణీ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. శాంతిభద్రతలకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్పీ కోరారు. కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్న కుమార్, అల్లాదుర్గం సీఐ రేణుకారెడ్డి, టేక్మాల్ ఎస్‌ఐ అరవింద్‌కుమార్, అలాగే.. పాపన్నపేట రూరల్ సీఐ జార్జ్, ఎస్బీ సీఐ సందీప్ రెడ్డి, సీసీఎస్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


