నాణ్యమైన విత్తనాలే లక్ష్యం
● కలెక్టర్ రాహుల్‌రాజ్
● ముసాయిదా విత్తన బిల్లుపై అభిప్రాయ సేకరణ
మెదక్ కలెక్టరేట్: రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడమే లక్ష్యంగా.. వారు పెట్టిన పెట్టుబడి తగ్గ ఆదాయం లభించేలా కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేస్తుందని కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముసాయిదా విత్తన బిల్లు 2025 బిల్లుపై క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన ముసాయిదా విత్తన చట్టం 2025పై అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా విత్తన చట్టం 1966, విత్తన నియంత్రణ చట్టం 1985 లకు కొత్తగా ప్రవేశపెట్టబడిన ముసాయిదా విత్తన చట్టం 2025 కు గల తేడాలను వివరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, ఉద్యానవన శాఖ అధికారి ప్రతాప్ సింగ్, ఈఈ ఇరిగేషన్ శ్రీనివాస రావు పాల్గొన్నారు.
ఎన్నికల నియమావళి తప్పనిసరి
కొల్చారం(నర్సాపూర్): ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు సూచించారు. మంగళవారం మండలంలో నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ క్రమంలో అధికారులతో సమావేశమై నిబంధనలపై వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడో విడత ఎన్నికల్లో భాగంగా నర్సాపూర్, చిలప్‌చెడ్, కొల్చారం, వెల్దుర్తి, శివ్వంపేట, కౌడిపల్లి, మాసాయిపేట మండలాల్లో నామినేషన్ స్వీకరణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో అలసత్వం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్ పత్రాల స్వీకరణ, పరిశీలన, అభ్యర్థుల ప్రకటన, గుర్తుల కేటాయింపు ప్రక్రియలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. కలెక్టర్ వెంట నర్సాపూర్ ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసాచారి, ఎంపీడీఓ రఫీక్ ఉన్నీసా, రిటర్నింగ్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.


