ఎత్తులు.. పైఎత్తులు
● 14 చోట్ల ఏగ్రీవమయ్యే అవకాశాలు
● గ్రామాభివృద్ధి పనులకు అభ్యర్థుల హామీలు
మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉప సంహరణకు గడువు ముంచుకొస్తుండటతో.. ఎన్నికల ఏకగ్రీవానికి ఎత్తులు వేస్తూ.. ప్రత్యర్థులను చిత్తు చేయడానికి రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. ఆరు మండలాల్లో సుమారు 14 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొంత మంది అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవం కాగా, మరి కొంత మంది ఆ దిశగా పావులు కదుపుతున్నారు. పార్టీల అండదండలు.. కుల సంఘాల ప్రభావం.. గ్రామాభివృద్ధికి నజరానాలు.. రాజకీయ పద్మవ్యూహాలు.. వెరసి ఏకగ్రీవానికి దారితీస్తున్నాయి.
– మెదక్ అర్బన్
జిల్లాలోని పాపన్నపేట, హవేలి ఘనపూర్, అల్లాదుర్గ్, శంకరంపేట, రేగోడ్, టేక్మాల్ మండలాల్లో ఈ నెల 11న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం నవంబర్ 25న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. 27 నుంచి 29 వరకు నామినేషన్ల దాఖలు, 30న నామినేషన్ పత్రాల పరిశీలన, డిసెంబర్ 3న సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహారణకు అవకాశం ఉంది. ఆరు మండలాల్లో 160 గ్రామపంచాయతీలు ఉండగా, 678 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఏకగ్రీవం దిశగా..
మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామపంచాయతీల్లో సుమారు 14 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. టేక్మాల్ మండలం చల్లపల్లి,హసన్ మహ్మద్‌పల్లి. సాలోజిపల్లి, శంరంపేట(ఏ) మండలం సంగారెడ్డిపేట, మాడ్‌శెట్పల్లి, గట్టుమీది తండా, దాదాపు ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. జమ్లానాయక్ తండా,కొత్తపేట,పాపన్నపేట మండలంలో నామాపూర్,యూసుఫ్‌పేట,అమ్రియా తండా, లక్ష్మీనగర్, కొంపల్లి, రేగోడ్ మండలంలో కొండాపూర్‌లో ఏకగ్రీవ ఎన్నిక కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఏకగ్రీవ సర్పంచ్‌లలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నట్లు సమాచారం. ఏకగ్రీవ యత్నాలు చేస్తున్న వ్యక్తులు పార్టీ పరంగా నాయకుల పరపతిని ఉపయోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల గ్రామాభివృద్ధి, సామాజిక కార్యక్రమాలకు డబ్బులు వెచ్చిస్తామని హామీలు ఇచ్చి, గ్రామస్థుల ఏకాభిప్రాయాన్ని సాధిస్తున్నారు. అయితే పంచాయతీ వార్డ్ మెంబర్లు సైతం ఎక్కువ సంఖ్యలో ఏకగ్రీవం అయ్యే అవకాశాలున్నాయి.


