పోటాపోటీ చేరికలు
కండువాలు కప్పుతున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు
పార్టీలో చేరుతున్న కాంగ్రెస్ నాయకులకు గులాబీ కండువా కప్పుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: చేరికలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కూడా పోటాపోటీగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన నాయకులకు కండువాలు కప్పుతున్నాయి. ఆయా గ్రామాల్లో మంచి పట్టున్న నాయకులకు గాలం వేస్తున్నాయి. సార్వత్రిక ఎన్నిక సమయంలో జరిగే చేరికలకు ఏమాత్రం తీసి పోని విధంగా ఇప్పుడు కూడా భారీ స్థాయిలో చేరికలు కొనసాగుతుండటంతో పంచాయతీ పోరు ఆసక్తిగా, రసవత్తరంగా మారుతోంది.
గులాబీ గూటికి కాంగ్రెస్, బీజేపీ నాయకులు
అధికార కాంగ్రెస్ పార్టీలో కీలకంగా ఉన్న నాయకులపై ప్రతిపక్ష బీఆర్‌ఎస్ గురి పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో గులాబీ పార్టీ తన పట్టును నిలుపుకున్న విషయం విదితమే. 11 అసెంబ్లీ స్థానాల్లో ఏడు చోట్ల విజయం సాధించిన గులాబీ పార్టీ ఇప్పుడు పంచాయతీ పోరును కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. గ్రామాల్లో పట్టున్న నాయకులను పార్టీలో చేర్చుకుంది. నర్సాపూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ జెడ్పీటీసీ మాజీ మంత్రి హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఇదే నియోజకవర్గంలో పలువురు బీజేపీ నాయకులు సైతం హరీశ్‌రావు సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు భవానీతో పాటు, ఆపార్టీకి చెందిన పలువురు సీనియర్ నాయకులు ఆదివారం కాంగ్రెస్‌ను వీడి గులాబీ పార్టీలో చేరారు. వీరికి హరీశ్‌రావు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్‌కల్, జహీరాబాద్ మండలాల్లో పలు గ్రామాల్లో కాంగ్రెస్ కీలక నాయకులు ఈ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా గులాబీ కండువా కప్పుకున్నారు. ఇలా పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ నాయకులను తమ పార్టీలో చేర్చుకుని ఈ ఎన్నికల్లో సత్తాచాటేందుకు బీఆర్‌ఎస్ పావులు కదుపుతోంది.
కాంగ్రెస్‌లోకి సైతం..
ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కూడా చేరికలపై దృష్టి సారించింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీల్లోకి కీలక నేతలకు కాంగ్రెస్ కండువాలు కప్పుతోంది. రాష్ట్రంలో తామే అధికారంలో ఉన్నామని, సర్పంచ్‌గా గెలిచాక పనులు చేసుకోవాలన్నా.. నిధులు తెచ్చుకోవాలన్నా.. తమ వద్దకే రావాల్సి ఉంటుందని చెబుతూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన కీలక నాయకులను పార్టీలో చేర్చుకుంటోంది. పెద్ద శంకరంపేటకు చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు ఇటీవల మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అలాగే తూప్రాన్ మండలంలోని వెంకటాయపాల్లికి చెందిన పలువురు బీఆర్‌ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. జహీరాబాద్ నియోజకవర్గం కొహీర్ మండలం కొత్తూరు, తదితర గ్రామాల్లో బీఆర్‌ఎస్ మాజీ సర్పంచులు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలా రెండు పార్టీలు చేరికలపై దృష్టి సారించడంతో గ్రామ పంచాయతీ పోరు రసవత్తరంగా మారుతోంది.
సార్వత్రిక ఎన్నికల తరహాలో పోకడ
రసవత్తరంగా పంచాయతీ పోరు


