మూడో విడతకు సన్నద్ధం
అదనపు కలెక్టర్ నగేష్
కౌడిపల్లి(నర్సాపూర్): మూడో విడత ఏడు మండలాల్లో జరిగే సర్పంచ్, వార్డుసభ్యుల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. మంగళవారం కౌడిపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద నామినేషన్ కౌంటర్లు, ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జిల్లాలో నర్సాపూర్ డివిజన్ పరిధిలోని ఏడు మండలాల్లో మూడో విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయిందన్నారు. ఈనెల 3వ తేదీ నుంచి 5వరకు నామినేషన్లు గడువు ఉందన్నారు. పోటీలో ఉండే అభ్యర్థులు చివరిరోజు వరకు వేచిచూడకుండా మొదటి రోజు నుంచి నామినేషన్లు వేయడం వల్ల ఇబ్బందులు ఉండవని చెప్పారు. నామినేషన్ కౌంటర్‌ల వద్ద హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. కౌడిపల్లి మండలంలో 35పంచాయతీలు, 280వార్డులకుగాను నామినేషన్ల స్వీకరణకు ఏడు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ రామారావ్, ఎంఈఓ బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.
కేటగిరి, సంతకాలు తప్పనిసరి
చిలప్‌చెడ్(నర్సాపూర్): అభ్యర్థులు అందజేసిన నామినేషన్ పత్రాలలో కేటగిరి, సంతకాలను తప్పనిసరిగా పరిశీలించాలని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. మంగళవారం చిలప్‌చెడ్ ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కౌంటర్లను పరిశీలించారు. రిటర్నింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్‌ల స్వీకరణ ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, తహసీల్దార్ సహదేవ్, తదితరులు పాల్గొన్నారు.


