
సమస్యల్లో సర్కారు ఆస్పత్రులు
బెల్లంపల్లి/తాండూర్/నెన్నెల/వేమనపల్లి/కాసిపేట: బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రభుత్వ ఆస్పత్రులు సమస్యలకు నిలయాలుగా మారాయి. వైద్యులు, సిబ్బంది కొరత, అసౌకర్యాలతో రోగులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బెల్లంపల్లి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వంద పడకలకు ఇంకా అప్‌గ్రేడ్ కాలేదు. ప్రస్తుతం 30పడకల సామర్థ్యంతో నిర్వహిస్తున్నారు. రోగుల తాకిడి అధికంగా ఉండగా.. నర్సుల కొరత నెలకొంది. వంద పడకలకు గాను 26మంది నర్సులు ఉండాల్సి ఉండగా.. 19మంది పని చేస్తున్నారు. వీరిలో తొమ్మిది మంది డిప్యూటేషన్‌పై వచ్చారు. నర్సుల పోస్టుల భర్తీలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. రోజువారీగా 250 నుంచి 300 మంది రోగులు వస్తున్నారు. పది మంది వైద్యులతో నెట్టుకొస్తున్నారు. అత్యవసర చికిత్స కోసం మంచిర్యాలకు రెఫర్ చేస్తున్నారు.
ఒక్కరే వైద్యులు
బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు వైద్యుల్లో ఒకరు మందమర్రికి డిప్యూటేషన్‌పై వెళ్లారు. ఒక్కరే వైద్యులు ఉండడంతో గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య కేంద్రం దారి చిరుజల్లులకే బురదగా మారడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉంది.
వారానికోసారి రాక
తాండూర్ మండలం మాదారం టౌన్‌షిప్ సింగరేణి డిస్పెన్సరీలో వారానికోసారి బుధవారం మాత్రమే వస్తుంటారు. మిగతా రోజుల్లో రోగులకు వైద్య సేవలు అందడం లేదు. ఇద్దరు స్టాఫ్‌నర్సులు, వార్డు అసిస్టెంట్ వైద్యం అందిస్తుంటారు.
● తాండూర్ పీహెచ్‌సీలో ముగ్గురు వైద్యులకు గాను శుక్రవారం ఇద్దరే కనిపించారు. ఏఎన్‌ఎం పోస్టులు మూడు ఖాళీ ఉండగా.. ఖాళీగా ఉన్న సబ్‌సెంటర్‌లో ఓ ఏఎన్‌ఎంతో నెట్టుకొస్తున్నా రు. ఆపరేషన్ థియేటర్‌లోని పరికరాలు చాలా రోజుల నుంచి వాడక నిరుపయోగంగా మారా యి. అవసరమైన పరికరాలు లేక గర్భిణులకు ప్రసవం చేయడం లేదు. బెల్లంపల్లి ఆస్పత్రికి రెఫర్ చేస్తున్నారు. కుక్కకాటు కేసులు అధికంగా వస్తున్నాయి. ఆయుర్వేద వైద్యశాలలో రెగ్యులర్ డాక్టర్ లేరు. డిప్యూటేషన్‌పై గురు, శుక్ర, శనివా రాల్లో వైద్యురాలు వస్తుంటారు. కాళ్లనొప్పులకు సంబంధించిన మందుల కొరత ఉంది.
రక్త పరీక్షలకు ఇబ్బంది
నెన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. రోజుకు 80నుంచి 100మంది రోగులు వస్తుండగా సరైన సేవలు అందడం లేదు. ఇద్దరు డాక్టర్లకు గాను ఒకరే విధులు నిర్వర్తిస్తున్నారు. ల్యాబ్‌టెక్నీషియన్ లేక గర్భిణులు, జ్వరబాధితులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు రక్త పరీక్షలకు ఇబ్బందులు పడుతున్నారు. ఒక స్టాఫ్‌నర్సు పోస్టు ఖాళీగా ఉంది. ఎస్‌వో లేక ఉన్న వైద్యుడిపై పని భారం పెరిగింది. ఆస్పత్రిలో తాగునీరు లేక రోగులు, సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.
సమయపాలన పాటించని వైద్య సిబ్బంది
వేమనపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. శుక్రవారం ఉదయం 11.30గంటల వరకు వైద్యాధికారి రాజేష్ విధులకు హాజరు కాలేదు. 24గంటల వైద్యం అమలులో ఉన్నా సమయపాలన పాటించకపోవడం గమనార్హం. 11.30గంటలకు ఎనిమిది మంది ఓపీ వచ్చారు. ఓపీ గది పక్కనే బ్లీచింగ్ పౌడర్ బస్తా చిరిగిపోయి ఉండడంతో వాసన వస్తోంది. అదనపు వైద్యాధికారి, సీహెచ్‌వో, మేల్ సూపర్‌వైజర్ స్టాఫ్‌నర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చామనపల్లి, నీల్వాయి, జిల్లెడ సబ్‌సెంటర్లలో ఏఎన్‌ఎం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎన్‌సీడీ సమావేశానికి ఏఎన్‌ఎంలు, సిబ్బంది హాజరు కాగా వైద్యాధికారి సమయానికి రాలేదు.
ఆసుపత్రి ముందే బురద
కాసిపేట పీహెచ్‌సీ ఎదుట బురదగా మారడంతో రోగులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 108, ఆటోరిక్షాలు వెళ్లేందుకు, నడవలేని వారిని వాహనాల్లో తీసుకెళ్లడం సమస్యగా మారింది. డ్రైవర్, ఆపరేటర్, స్టాఫ్‌నర్సు పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పరికరాలు సమకూర్చితే ప్రసూతి చేస్తాం
ఆసుపత్రి థియేటర్‌లోని పరికరాలు చాలా రోజుల నుంచి వాడకపోవడంతో పనికి రాకుండా పోతున్నాయి. నిధుల లేమితో కొత్త పరికరాలు కొనుగోలు చేయలేకపోతున్నాం. పరికరాలు సమకూర్చితే గర్భిణులకు ప్రసవాలు చేస్తాం.
– డాక్టర్ ఝాన్సీ, తాండూర్ పీహెచ్‌సీ

సమస్యల్లో సర్కారు ఆస్పత్రులు

సమస్యల్లో సర్కారు ఆస్పత్రులు