
బస్తీ దవాఖానాలో పరికరాలు కరువు
చెన్నూర్/చెన్నూర్‌రూరల్/కోటపల్లి/మందమర్రిరూరల్: చెన్నూర్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరత నెలకొంది. కొన్ని ఆస్పత్రుల్లో పరికరాల కొరత కారణంగా వైద్యం అరకొరగా అందుతోంది. చెన్నూర్ బస్తీ దవాఖానా హెడ్‌నర్సు కృష్ణకుమారి ఒక్కరే ఉన్నారు. వైద్యులు చెన్నూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి వెళ్లారని తెలిపారు. బస్తీ దవాఖానాకు రోజు ఓపీ 20 నుంచి 30మంది వస్తున్నారని, కొన్ని పరికరాలు కావాల్సి ఉందని, త్వరలోనే వస్తాయని వైద్యురాలు లక్ష్మీప్రసన్న తెలిపారు.
● చెన్నూర్ మండలం అంగ్రాజ్‌పల్లి పీహెచ్‌సీ వైద్యుడు ఉన్నత చదువుల నిమిత్తం వెళ్లారు. దండేపల్లి వైద్యుడు డిప్యూటేషన్ విధులు నిర్వర్తిస్తున్నారు. పీహెచ్‌సీ పరిధిలోని ఎనిమిది సబ్‌సెంటర్లలో మొదటి ఏఎన్‌ఎంలు ఎనిమిది మంది ఉండాల్సి ఉండగా.. నలుగురే ఉన్నారు. హెచ్‌ఈవో, సూపర్‌వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నలుగురు హెల్త్ అసిస్టెంట్లకు గాను ఒక్కరే ఉన్నారు.
● కోటపల్లిలోని ఆయుర్వేద వైద్యశాల సిబ్బంది లేక ఏడాదిగా మూసి ఉంటోంది. పీహెచ్‌సీలో ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్‌లు లేరు. రక్త పరీక్షలు ప్రైవేటుగా చేయించుకుంటున్నారు.
● మందమర్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రెండు మూడు నెలలుగా ఇన్స్‌లిన్ కొరత ఉంది. రోగులు ప్రైవేటు మందుల దుకాణాల్లో కొనుగోలు చేయాల్సి రావడంతో ఆర్థిక భారం తప్పడం లేదు. మందమర్రి, పొన్నారంలో ఒక్కో వైద్యుడి పోస్టు ఖాళీగా ఉన్నాయి.