
వీడని అసంతృప్తి!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: మంత్రి పదవి ఆశించి భంగపడిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు(పీఎస్సార్) అసంతృప్తి వీడడం లేదు. రెండో విడతలో తనకు కేబినెట్ బెర్త్ ఖాయమని భావించినా పక్కన పెట్టడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆయన అనుచరవర్గానికి ఊహించని విధంగా షాక్ తగిలింది. మరోవైపు జిల్లా నుంచే చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామికి మంత్రిగా అవకాశం కల్పించి తనకు ఇవ్వకపోవడంపై గత కొద్ది రోజులుగా అసంతృప్తితోనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు గత పదేళ్లుగా ఉమ్మడి జిల్లాలో బలోపేతానికి కృషి చేశానని, తనకు అవకాశం కల్పించాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇంద్రవెల్లి సభ నుంచి అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పాదయాత్రతోపాటు మంచిర్యాలలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బహిరంగ సభ వరకు ఎన్నో పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేశారు. ఎన్నికల ముందు ఏఐసీసీ అధ్యక్షుడితో సహా పలువురు అగ్రనేతలు పీఎస్సార్‌కు సముచిత స్థానం ఉంటుందని హామీలు ఇచ్చారు. తీరా ఆయనకు అవకాశం రాకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. ఇటీవల గాంధీభవన్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకున్నారు. తనకు అవకాశం కల్పించాలని ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎటువైపో..!
గత ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో నిర్వహించిన ‘జై బాపు జై భీమ్ జై సంవిధాన్’ బహిరంగ సభలో తన గొంతు నొక్కొద్దంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు ముందే ఆవేదనతో మాట్లాడారు. నిన్న మొన్న వచ్చిన వాళ్లకు అవకాశం ఇచ్చి తనను విస్మరిస్తున్నారని అన్నారు. ఉమ్మడి జిల్లాకు పదవుల్లో అన్యాయం చేస్తే ఏం చేయడానికై నా సిద్ధమేనంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో తన అసంతృప్తి ఎటువైపు దారి తీస్తుందోనని రాజకీయంగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచీ విధేయతగా ఉంటున్నారు. అయినా కేబినెట్‌లో చోటు దక్కకపోవడంపై తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో మంత్రివర్గంలో చోటు కాకుండా ఇతర ఏ పదవీ ఇచ్చినా తీసుకునేందుకు ఇష్టపడడం లేదు. ఎమ్మెల్యేగానే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో అధిష్టానం ఆయనకు అవకాశం ఇస్తుందా..? లేదా..? పీఎస్సార్ వెనక్కి తగ్గి ఉంటారా..? అనే చర్చ పార్టీ వర్గాల్లో నడుస్తోంది.
మంత్రివర్గంలో చోటు దక్కక నిరాశలో పీఎస్సార్
అగ్రనేతలను కలుస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే
తనకు అన్యాయం జరిగిందంటూ వేడుకోలు