
టేకు చెట్ల నరికివేత
జన్నారం: జన్నారం అటవీ డివిజన్‌లోని కవ్వాల్ సెక్షన్ పరిధిలో విలువైన టేకు చెట్లు నరికివేతకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కలప స్మగ్లర్లు గుట్టు చప్పుడు కాకుండా కవ్వాల్ బీట్ బోడగుట్ట ప్రాంతంలో మూడు టేకు చెట్లను నరికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే సంఘటన జరిగి వారంరోజులైనా అటవీశాఖ అధికారులు గుర్తించకపోవడం గమనార్హం. బుధవారం అడవికి వెళ్లిన ఓ వ్యక్తి గమనించడంతో విషయం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి నరికివేతకు గురైన చెట్ల కొలతలు సేకరించారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే..
కవ్వాల్ సెక్షన్ పరిధిలో పనిచేసే అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నట్లు ఈ సంఘటన ద్వారా తెలుస్తోంది. రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహించకపోవడం, సిబ్బంది స్థానికంగా ఉండక పోవడం వల్లే స్మగ్లర్లు దుశ్చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. గతంలో రేంజ్ అధికారి శ్రీనివాస్ రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ నిర్వహించి అడపా దడపా తనిఖీలు చేయడంతో స్మగ్లర్లు కాస్త వెనక్కి తగ్గారు. ఈ విషయమై ఇందన్‌పల్లి రేంజ్ అధికారి కారం శ్రీనివాస్‌ను సంప్రదించగా కలప స్మగ్లర్లు 3 టేకుచెట్లను నరికి తీసుకెళ్లినట్లు తెలిపారు. వాటి విలువ సుమారు 1.15 లక్షలు ఉంటుందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఘటనపై విచారణ జరుపుతున్నామన్నారు. బాధ్యులపై శాఖ పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.