
ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య
వాంకిడి: ఉరేసుకుని ఒకరు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై ప్రశాంత్ తెలిపిన వివరాల మేరకు బెజ్జుర్ మండలంలోని రేచిని గ్రామానికి చెందిన వడై వెంకటి (40)కి వాంకిడి మండలంలోని నార్లాపూర్‌కు చెందిన తానుబాయితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి మద్యానికి బానిసయ్యాడు. దీంతో తానుబాయి అతనితో మద్యం మానిపించాలని నార్లాపూర్‌కు తీసుకువచ్చింది. అక్కడే వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలం బాగానే ఉన్న వెంకటి మళ్లీ మద్యానికి బానిసయ్యాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చి నిత్యం భార్యతో గొడవపడేవాడు. కుటుంబ సభ్యులు మందలించేందుకు ప్రయత్నిస్తే ఉరేసుకుంటానని బెదిరించేవాడు. ఈ క్రమంలోనే సోమవారం సాయంత్రం వాంకిడి వెళ్తానని చెప్పి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు తెలిసిన చోట వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం ఉదయం అదే గ్రామానికి చెందిన వడై సంతోష్ చేనులో చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. తానుబాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
భూతగాదాల కారణంగా..
నర్సాపూర్(జి): భూతగాదాలతో మనస్తాపం చెంది ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గణే శ్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని కుస్లి గ్రామానికి చెందిన నార్వాడె ఆనంద్‌రావు(54)కు, తన సమీప బంధువులకు మధ్య భూ తగాదాలు ఉన్నాయి. దీంతో మనస్తాపం చెందిన ఆనంద్‌రావు సోమవారం ఇంటివద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆటోలో నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుని భార్య అనురాధ ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
మనస్తాపంతో యువకుడు..
సోన్: ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గోపి తెలిపిన వివరాల మేరకు మండలంలోని సాకేర గ్రామానికి చెందిన సారంగ విజయ్ (29) అనే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం గ్రామానికి సమీపంలో ఉన్న సూర్యకుటీర్‌లో చెట్టుకు ఉరేసుకున్నాడు. మృతుని తల్లి సుశీల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై గోపి సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
జీవితంపై విరక్తితో ఒకరు..
సాత్నాల: జీవితంపై విరక్తితో ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై గౌతమ్ పవర్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని పార్టీ (బి) గ్రామానికి చెందిన బండి వెంకటి (38) పంటచేనులో రసాయన మందులు పిచికారీ చేస్తుండగా ఎదురుగాలి వీయడంతో అతనిపై పడి అనారోగ్యానికి గురయ్యాడు. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది గతనెల 29న ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. మృతునికి కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుని భార్య పుష్పలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి జైలు
నిర్మల్‌టౌన్: ఒకరి మృతికి కారణమైన వ్యక్తికి రెండేళ్ల జైలుశిక్ష, రూ.4 వేల జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు జడ్జి శ్రీవాణి మంగళవారం తీర్పునిచ్చినట్లు కోర్టు సమన్వయల అధికారి డల్లు సింగ్ తెలిపారు. లోకేశ్వరం మండలం భామిని(బి) గ్రామానికి చెందిన త్రయంబకరావు 2020లో అడవి జంతువులు వస్తున్నాయని తన మొక్కజొన్న చేనుచుట్టూ జియోవైరు చుట్టి విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. అటుగా వెళ్లిన అదే గ్రామానికి చెందిన బాలాజీ వైరును తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కావడంతో విచారణ చేపట్టి నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు.

ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య