
మీ తమ్మునిపై కేసు అయ్యింది..
● ఉపాధ్యాయుడికి సైబర్ నేరస్తుడి ఫోన్.. ● అప్రమత్తతతో తప్పించుకున్న బాధితుడు
జన్నారం: హలో.. నేను సీబీఐ నుంచి మాట్లాడుతున్నా.. మీ తమ్మునిపై కేసు నమోదైంది. మీరు వెంటనే ఆదిలాబాద్ రండి.. లేకుంటే చాలా ప్రమాదంలో పడుతారని ఉపాధ్యాయుడికి ఫోన్‌రావడంతో మొదట బిత్తరపోయిన ఉపాధ్యాయుడు తేరుకుని సైబర్ నేరస్తుడని గ్రహించి తప్పించుకున్న సంఘటన జన్నారంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు జన్నారం మండలం కిష్టాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు ప్రకాశ్‌నాయక్‌కు ఓ వ్యక్తి ఫోన్‌చేసి నేను సీబీఐ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా.. మీ తమ్ముదు ప్రమోద్‌పై కేసు నమోదైంది. మీరు వెంటనే ఆదిలాబాద్‌కు రండి అని చెప్పాడు. మొదటగా భయాందోళనకు గురైన ఉపాధ్యాయుడు వెంటనే ఆదిలాబాద్‌లో ఉంటున్న ప్రమోద్‌కు ఫోన్ చేశాడు. ఎక్కడున్నావని అడుగగా గుడిలో పూజ చేస్తున్నట్లు చెప్పాడు. సదరు ఉపాధ్యాయుడు అదే నంబర్‌కు ఫోన్ చేసి బెదిరించడంతో సైబర్ నేరగాడు ఫోన్ కట్ చేశాడు. విషయాన్ని ఎస్సై అనూషకు చెప్పడంతో అలాంటి ఫేక్ కాల్‌లను నమ్మవద్దని సూచించారు.