
సీఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేయాలి
● రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్.చౌహన్
మంచిర్యాలఅగ్రికల్చర్: జిల్లాకు కేటాయించిన సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ప్రధాన కార్యదర్శి డీఎస్.చౌహన్ సూచించారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంచాలకులు ముజా మిల్‌ఖాన్, ఇతర అధికారులతో కలిసి కలెక్టర్, పౌరసఫరాల శాఖ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సీజన్‌లో లక్ష్యానికి మించి ధాన్యం కొనుగోలు చేయడంతో బాధ్యత మరింత పెరిగిందన్నారు. బ్యాంకు గ్యారంటీలు ఇచ్చిన రైస్‌మిల్లులకు ధాన్యం కేటాయించాలని తెలిపారు. వచ్చే సీజన్‌లో ధాన్యం కొనుగోలుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. రేషన్ కార్డు కోసం వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి అర్హులకు జారీ చేయాలని తెలిపారు. కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో లక్ష్యం మేరకు ధాన్యం సేకరించి మిల్లులకు తరలించామని తెలిపారు. సీఎంఆర్ లక్ష్యాలను త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మరావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.