
పెండింగ్ భూసమస్యలు పరిష్కరిస్తాం
భీమారం: ధీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రైతుల భూసమస్యలను భూభారతి చట్టం ద్వారా పరిష్కరించనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మంగళవారం మండలంలోని రెడ్డిపల్లి, ఆర్కెపల్లి గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు హాజరై మాట్లాడారు. భూభారతి చట్టాన్ని భీమారం మండలంలోనే పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టినట్లు తెలిపారు. తాము రెడ్డిపల్లి రెవెన్యూ శివారులో గతంలో కొనుగోలు చేసిన భూములను పట్టాలు చేయించుకోలేదని రైతులు కలెక్టర్‌కు తెలిపారు. గత ప్రభుత్వం ధరణి ప్రవేశపెట్టిన తర్వాత అనుభవదారుల కాలం ఎత్తేగా హక్కులు కోల్పోయామని, భూములు తమ వద్దే ఉన్నా లాభం లేకుండా పోయిందని వాపోయారు. అమ్మిన పట్టాదారులు ఇప్పటికీ అమ్మినట్లు సంతకాలు చేస్తామంటున్న నేపథ్యంలో సాదాబైనామాలో పట్టాలు చేయాలని రైతులు కోరగా కలెక్టర్ అంగీకరించారు. గ్రామంలో అసంపూర్తి పాఠశాల భవనాన్ని కలెక్టర్ పరిశీలించి పనులు పూర్తి చేసేందుకు నిధులు విడుదల చేస్తామని, అంగన్‌వాడీ భవనం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అదనపు కలెక్టర్ మోతీలాల్, తహసీల్దార్లు సదానందం, మల్లికార్జున్ ఉన్నారు.
సమాజ మార్పు ఉపాధ్యాయులతోనే..
నస్పూర్: సమాజంలో మార్పు తీసుకురావడం ఉపాధ్యాయులతోనే సాధ్యమని కలెక్టర్ కుమార్‌దీపక్ పేర్కొన్నారు. మంగళవారం తీగల్‌పహడ్ జెడ్పీహెచ్‌ఎస్‌లో వివిధ మండలాల సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యాక్రమానికి డీఈవో యాదయ్యతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సామర్థ్యాల పెంపునకు నిర్వహిస్తున్న శిక్షణను ఉపాధ్యాయులంతా సద్వినియోగం చేసుకోవాలని, విద్యార్థుల్లో ఆశించిన మార్పుల సాధనే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. సమగ్ర శిక్ష సమన్వయకర్తలు చౌదరి, సత్యనారాయణమూర్తి, కోర్స్ డైరెక్టర్ జీ రామన్న, రిసోర్స్ పర్సన్స్ మహేశ్, రాజేశ్వరి, రమేశ్, రాజన్న పాల్గొన్నారు.