
ఎడారి దేశంలో జిల్లావాసి జైలు జీవితం
● చేయని నేరానికి గల్ఫ్ బాధితుడి నరకయాతన ● న్యాయ సహాయం కోసం కుటుంబసభ్యుల వేడుకోలు
నిర్మల్‌ఖిల్లా: చేయని నేరానికి అకారణంగా ఎడారి దేశంలో జైలుశిక్ష అనుభవిస్తున్న తమ కుటుంబ సభ్యుడికి న్యాయ సహాయం అందించాలని గల్ఫ్ బాధిత కుటుంబ సభ్యులు కోరారు. జిల్లా కేంద్రంలో శనివారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర ఎన్నారై అడ్వైజరీ కమిటీ స్వదేశ్ వర్కిపండ్లతో కలిసి కలిసి వివరాలు వెల్లడించారు. కుంటాల మండలం అంబకంటి గ్రామానికి చెందిన గజకరెడ్ల సాయన్న (51) ఉపాధి నిమిత్తం గతేడాది దుబాయ్ వెళ్లాడు. అక్కడ ఏప్రిల్ 16న స్థానిక పోలీసులు అరెస్టు చేసి అబుదాబీ జైలుకు తరలించారు. సమాచారం తెలిసిన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ఎవరిని సంప్రదించాలని తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో ఎన్‌ఆర్‌ఐ రాష్ట్ర అడ్వైజరీ కమిటీ సభ్యుడు స్వదేశ్ పరికిపండ్లను కలిసి సమస్యను వివరించారు. నిరక్షరాస్యత కారణంగా తన పేరిట ఇతరులకు తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించకపోవడంతో అక్కడి పోలీసులు అరెస్టు చేసి జైలులో వేసినట్లు కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశ్ మాట్లాడుతూ బాధితుడి సమగ్ర వివరాలతో అక్కడి ఎంబసీకి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చామన్నారు. న్యాయసహాయం ద్వారా జైలు నుంచి విడిపించే ప్రయత్నం చేస్తామని కుటుంబసభ్యులకు భరోసానిచ్చారు. బాధితుడి తల్లి భోజవ్వ, భార్య మంజుల, కుమారుడు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.