
‘ఆర్థిక విధ్వంసం సృష్టించిందే బీఆర్‌ఎస్’
నార్నూర్: తెలంగాణలో పదేళ్ల అధికారంలో ఉండి ఆర్థిక విధ్వంసం సృష్టించిందే బీఆర్‌ఎస్ అని పార్టీ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ అన్నారు. గురువారం ఏర్పాటుచేసిన జైబాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, రాజ్యాంగాన్ని భారత్ గౌరవిస్తుందన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీలు సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీని బదనాం చేస్తున్నాయన్నారు. తప్పుడు ప్రచారం చేస్తే సహించేదిలేదని హెచ్చరించారు. అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు గౌరవం ఇవ్వాల్సిందేనన్నారు. ఇందిరమ్మ కమిటీ పారదర్శకంగా పనిచేయాలన్నారు. కార్యకర్తలు ఐక్యంగా ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందన్నారు. సమావేశంలో పెద్దపల్లి గ్రంథాలయ చైర్మన్ మల్లయ్య గౌడ్, కుమురం భీం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విశ్వప్రసాద్, పార్టీ మండల అధ్యక్షుడు లోఖండే దేవురావు, మాజీ సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పరమేశ్వర్, మాజీ జెడ్పీటీసీ బిర్జిలాల్, తదితరులు పాల్గొన్నారు.