● ప్రభుత్వ, సింగరేణి ఖాళీ స్థలాల్లో చిరు వ్యాపారాలు ● స్టాళ్లు నిర్మించి అద్దెకు ఇస్తే మున్సిపాలిటీకి వనరులు
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీలో ప్రభుత్వ, సింగరేణి ఖాళీ స్థలాలకు కొదువలేదు. అంతర్గత ప్రధాన రహదారి పక్కన ఉన్న ఖాళీ స్థలాల్లో చిరు వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. నిరుపేదలు, నిరుద్యోగులు, సింగరేణి రిటైర్డు కార్మికులు తోపుడు బండ్లపై, తాత్కాలికంగా చిన్నపాటి షెడ్లను ఏర్పాటు చేసుకుని పండ్లు, కూరగాయలు, మటన్, చికెన్, ఇతర రకాల వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. చిరు వ్యాపారం పేద కుటుంబాలకు జీవనాధారంగా మారగా శాశ్వత ప్రాతిపదికన నిర్వహించే అవకాశాలు లేకుండా ఉన్నాయి. మున్సిపాలిటీ పరంగా స్టాళ్లను నిర్మించి చిరు వ్యాపారులకు కేటాయిస్తే జీవనోపాధి కల్పించడంతో పాటు బల్దియాకు ఆదాయ వనరులు సమకూరే అవకాశాలు ఉన్నాయి. మున్సిపాలిటీ అధికారులు ఆదిశగాసానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇలా చేస్తే ఉపయోగం
మున్సిపాలిటీలోని స్టేషన్ రోడ్‌కాలనీ (చమ్రీస్ క్వార్టర్స్) అంతర్గత ప్రధాన రహదారి పక్కన చౌడేశ్వరి ముందు, కోర్టు ఎదుట ఉన్న ఖాళీ స్థలాల్లో ప్రస్తుతం తోపుడు బండ్లు, షెడ్ల ఆధారంగా ప్రజావసరాలకు అనుగుణంగా మటన్, చికెన్, కట్టెలు, పండ్లు ఇతర రకాల వ్యాపారాలు జరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో మున్సిపాలిటీ పరంగా స్టాళ్లను నిర్మించడం వల్ల చిరు వ్యాపారులకు లబ్ధిచేకూరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
● ఏరియాలకు అనుగుణంగా అందుబాటులో స్టాళ్లను నిర్మించడం వల్ల ఆయా ప్రాంతాల వాసులకు నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి సౌలభ్యంగా ఉంటుంది. బజారు ఏరియా ప్రాంతానికి రావడానికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం కలిసి వస్తుంది. కాలినడకన వెళ్లి సునాయాసంగా కొనుగోలు చేయడానికి వీలు కలుగుతుంది.
● మున్సిపాలిటీలో నివసిస్తున్న యువతకు స్వయం ఉపాధి లభించడంతో పాటు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులు నివారించడానికి అవకాశాలు ఉంటాయి.
● రోడ్డు పక్కన ఉన్న ఖాళీ స్థలాల్లో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కల్లో దోమలు, ఈగలు వృద్ధి చెందకుండా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత ఏర్పడుతుంది.
● స్టాళ్ల ఏర్పాటు వల్ల మున్సిపాలిటీకి స్థిరమైన ఆదాయం వస్తుంది. తద్వారా సిబ్బందికి వేతనాలు చెల్లించడానికి ఆర్థికభారం నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.
● స్టాళ్లను నిర్మించడం వల్ల సాధ్యమైనంత వరకు ఖాళీ స్థలాలు దురాక్రమణకు గురి కాకుండా ఉంటాయి. ప్రజావసరాలకు దోహద పడతాయి.
రెండు చోట్ల స్టాళ్ల నిర్మాణం
మున్సిపాలిటీ తరపున ఇప్పటికే మూసివేతకు గురైన సింగరేణి వర్క్‌షాప్, స్టోర్స్ ముందు ప్రధాన రహదారి పక్కన, కాల్‌టెక్స్ ఫ్‌లై ఓవర్ బ్రిడ్జి కింద స్టాల్‌ల నిర్మాణం జరిగింది. వాటిని చిరు వ్యాపారులు అద్దెకు తీసుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. కాల్‌టెక్స్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద రెండువైపులా స్టాళ్లు ఉండగా ఒకవైపు ఉన్న వాటిని మాత్రమే అద్దెకు తీసుకున్నారు. రామకృష్ణ థియేటర్ పక్కన నిర్మించిన స్టాళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కాగా స్టాళ్లలో కాకుండా ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద కొంతమంది కూరగాయలు అమ్మకాలు సాగిస్తుండడం గమనార్హం. స్టాళ్ల ద్వారా మున్సిపాలిటీకి స్థిరమైన ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నా సరిగా శ్రద్ధపెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి సముచిత నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.