
మంచిర్యాలలో పీఎస్టీ వసూళ్లు
● మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు
మంచిర్యాలటౌన్: దేశంలో పన్ను వసూలుకు జీఎస్టీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు పీఎస్టీ(ప్రేమ్‌సాగర్‌రావు ట్యాక్స్) వసూలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మంచి మంచిర్యాలను వసూలు మంచిర్యాలగా మార్చారని విమర్శించారు. మంచిర్యాల ఉమర్‌మియా సొసైటీలో ఇంటికి రూ.6 లక్షలు, కలెక్టర్ కార్యాలయం వద్ద కూల్చిన ఇళ్లను మళ్లీ కట్టి, కోట్లు వసూలు చేశారని, మంచిర్యాల వ్యాపారుల వద్ద రూ.40 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. రోడ్డు వెడల్పు పేరిట భవనాన్ని కూల్చకుండా ఉండేందుకు గాను ఒక్కో భవనానికి రూ.10 లక్షల చొప్పున, ఒకచోట రూ.50 లక్షలు వసూలు చేశారని విమర్శించారు. ఇటిక్యాల చెరువు ఎఫ్‌టీఎల్ పరిధి నెపంతో రూ.2 కోట్ల వసూలు చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. బైపాస్ రోడ్డులోని ప్రభుత్వ, ప్రైవేటు భూములు, బెల్లంపల్లి చౌరస్తా భూమి, తిలక్‌నగర్ ప్రభుత్వ భూమి, నస్పూరులోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని, బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని తప్పకుండా కూల్చుతామని అన్నా రు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను కూల్చిన తర్వాత వచ్చిన మెటీరియల్‌ను అమ్మితే వచ్చిన డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్లిందని ప్రశ్నించారు. శ్మశాన వాటిక నిర్వహణ కోసం మార్వాడి సమాజం, వైశ్యులు, బంగారం దుకాణాల నుంచి నెలకు రూ.లక్షల చొప్పున ఇవ్వాలని చెప్పడం ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు అంకం నరేశ్, గోగుల రవీందర్, బేర సత్యనారాయణ, మొగిలి శ్రీనివాస్, ఎర్రం తిరుపతి, పడాల రవీందర్, నాయకులు పాల్గొన్నారు.