● మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి ● సినీనటుడు సాయికుమార్‌కు భీం అవార్డు ప్రదానం
ఆసిఫాబాద్: కుమురం భీం పేరుతో జాతీయ అవార్డు ప్రదానం చేయడం ఆదివాసీ జాతికి గర్వకారణమని మాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి పార్థసారథి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రేమల గార్డెన్‌లో భారత్ కల్చరల్ అకాడమీ, ఆదివాసీ సాంస్కృతిక పరిషత్, ఓం సాయితేజా ఆర్ట్స్, నవజ్యోతి సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ గోడం నగేశ్, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, హాస్యనటుడు బాబూమోహన్, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి, నవజ్యోతి వ్యవస్థాపకులు దండనాయకుల సురేశ్‌కుమార్, భీమ్ మనవడు సోనేరావుతో పాటు పలువురు సినీ ప్రముఖులతో కలిసి సినీనటుడు సాయికుమార్‌కు అవార్డు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎన్నికల అధికారి పార్థసారథి మాట్లాడుతూ కుమురం భీం జీవితం ప్రతీ ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. అడవి మీద హక్కుల కోసం జల్ జంగల్ జమీన్ నినాదంతో నిజాం పాలకులతో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన వీరుడు కుమురం భీం అన్నారు. అవార్డు గ్రహీత సాయికుమార్ మాట్లాడుతూ కుమురంభీం సినిమాలో నటించి, భీమ్ నడియాడిన ప్రాంతంలో జాతీయ అవార్డు పొందడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కళాకారుడిగా పుట్టడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి, కుమురంభీం చరిత్రను ప్రపంచం దృష్టికి తీసుకెళ్తున్న డి సురేశ్‌కుమార్‌ను అభినందించారు. కలెక్టర్ వెంకటేశ్ దోత్రే మాట్లాడుతూ జిల్లాలో ఎంతోమంది ఉన్నత స్థాయి గిరిజన కళాకారులున్నారని, ఇటీవల గుస్సాడీ నృత్యానికి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం లభించిందని గుర్తు చేశారు. నవజ్యోతి సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకులు దండనాయకుల సురేశ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు, జలపాతాలు, ప్రముఖ దేవాలయాలు అభివృద్ధి చేయాలన్నారు. తొలుత జిల్లా కేంద్రంలోని సాయి మందిరం, అంకమ షా సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని కుమురం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సినీ కళాకారులను సత్కరించారు. కార్యక్రమంలో యువ దర్శకుడు నక్క రాహుల్, నిర్మాత రాం సత్యనారాయణ, నటుడు రాంజగన్, బీజేపీ నాయకుడు అరిగెల నాగేశ్వర్‌రావు, ఆదివాసీ నాయకుడు సిడాం అర్జు, నవజ్యోతి సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు డి.వెంకటేశ్వర్లు, సాయిని రాజశేఖర్, కళాకారులు, ఆదివాసీలు, విద్యార్థులు పాల్గొన్నారు.
కుమురం భీం పేరుతో అవార్డులు గర్వకారణం