● 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
నస్పూర్: పిచ్చుకల సంరక్షణతోనే జీవ వైవిద్యం కొనసాగుతుందని నేటి ఆధునిక సమాజంలో ఎంతమందికి తెలుసు. ఈ భూగోళంపై నివసించే ప్రతీ జీ వి, మానవునితో పాటు సకల ప్రాణుల మనుగడ కు, జీవవైవిద్యానికి, ఆహార ఉత్పతికి సైతం పిచ్చుకల పరపరాగ సంపర్కమే కారణం. కనుమరుగవుతున్న కమనీయ పిచ్చుకల జాతులను కాపాడుకోకుంటే తీరని నష్టం వాటిల్లుతుందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. పంట చేలల్లో, పల్లె ముంగిట్లో ధాన్యపు రాశుల్లో కిలకిల మంటూ సందడి చేసే పిచ్చుకలు మానవుడు పెంచుకుంటున్న సాంకేతిక పరిజ్ఞానంతో వాటి మనుగడకు శాపంగా మా రిందని సెల్ తరంగాల రేడియేషన్, కాలుష్యం కారణంగా ఇవి ప్రకృతి నుండి కనుమరుగవుతున్నాయ ని పర్యావరణ వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తల్లి ప్రేమకు నిదర్శనం
జనావాసాలతో మమేకమై జీవిస్తున్న పిచ్చుకలు మెత్తని పీచు వంటి వాటితో గూడు కట్టుకోవడం, అందులో గుడ్లు పెట్టడం, వాటిపై పొదగడం, పుట్టిన పిల్లలకు ఆహారాన్ని నోటితో తెచ్చి అందించడం, వాటికి రెక్కలొచ్చి ఎగిరేంత వరకు జాగ్రత్తగా కాపాడడం వంటి దృశ్యాలు తల్లి ప్రేమకు నిదర్శనంగా నిలుస్తాయనడంలో అతిశయోక్తి లేదు.
మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవం
ఆదర్శవంతమైన పిచ్చుకల అన్యోన్యతను, తల్లి ప్రేమకు మరోపేరుగా గుర్తించిన ప్రపంచ దేశాలు పిచ్చుకల సంరక్షణపై అవగాహన కల్పించడానికి ప్రతీ సంవత్సరం మార్చి 20న ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాయి. పిచ్చుకల ప్రాధాన్యతను గుర్తించిన భారత ప్రభుత్వం తపాలా బిల్లును సైతం విడుదల చేసిందని పర్యావరణ వేత్తలు గుర్తు చేస్తున్నారు.
పిచ్చుకలను బతుకనిద్దాం
పిచ్చుకల మనుగడకు ప్రమాదం ఏర్పడితే మానవ మనుగడపై తీవ్ర ప్రమాదం ఏర్పడుతుంది. పిచ్చుకల సంరక్షణ ప్రతీఒక్కరి బాధ్యత. వాటి ఆవాసం కోసం ఇంటి ఆవరణలో వెదురు, కర్ర, అట్టడబ్బాలతో గూళ్లు తయారు చేయాలి. మట్టిపాత్రలో నీరు, ధాన్యపు గింజలు పోసి ఉంచాలి. ఇంటి ముందు రసాయనాలు లేని బియ్యపు పిండి ముగ్గు వేస్తే వాటికి ఆహారంగా ఉపయోగపడుతుంది. పిచ్చుకలు పదికాలాల పాటు పదిలంగా బతికేలా మానవులుగా మనవంతుగా సహకరిద్దాం.. పిచ్చుకలను బతుకనిద్దాం. పర్యావరణాన్ని కాపాడుదాం.
– గుండేటి యోగేశ్వర్, పర్యావరణ వేత్త, రిటైర్డ్ టీచర్, నస్పూర్
పిచ్చుకలతో జీవ వైవిధ్యం