మంచిర్యాలఅగ్రికల్చర్: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి, జిల్లా పంచాయతీరాజ్ ఇంజినీర్, డిప్యూటీ ఈఈలు, ఏఈఈలతో అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఉపాధిహామీ పథకం కింద రూ.43 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఇప్పటివరకు రూ.22 కోట్ల పనులు పూర్తయ్యాయని తెలిపారు. సీసీ రోడ్లు, గ్రామ పంచాయతీ, అంగన్‌వాడీ కేంద్ర భవనాలు, పాఠశాలల ప్రహరీలు, పశువుల పాకలు, మేకల షెడ్లు, ఇంకుడు గుంతలు, నర్సరీలు తదితర పనులు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 2,050 పనులు మంజూరు కాగా ఇప్పటివరకు 1,617 పనులు పూర్తి చేశామని, మిగతావి ఈ నెల 20లోగా పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయతీ ఇంజినీర్ రామ్మోహన్‌రావు పాల్గొన్నారు.
ఆకస్మిక పర్యటన
మందమర్రిరూరల్: మందమర్రిలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం ఆకస్మికంగా పర్యటించారు. మండల కేంద్రంలోని ఐటీఐ ఆవరణలో ఏటీసీని సందర్శించారు. యంత్రాలను పరిశీలించి వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపాల్ దేవానంద్, టీటీఎల్ సిబ్బందిని ఆదేశించారు. తహసీల్దార్ కార్యాలయంలో పలువురు డబుల్ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారులకు ధ్రువపత్రాలు అందజేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అన్ని రకాల మందులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని సూచించారు. మోడల్ స్కూల్‌లో ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించారు. సారంగపల్లిలోని నర్సరీ, పొన్నారంలో జెడ్పీ హైస్కూల్ సందర్శించారు. తహసీల్దార్ సతీష్‌కుమార్, ఆర్‌ఐ గణపతి తదితరులు పాల్గొన్నారు.
● జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్