
● ఏడాదిన్నరగా ముందుకు రాని కాంట్రాక్టర్లు ● మున్సిపాల్ ఆదాయం కోసం సిబ్బందితో వసూలు ● తాజాగా శుక్రవారం వేలం నిర్వహణకు ఏర్పాట్లు
చెన్నూర్: చెన్నూర్ మున్సిపాలిటీలో తైబజార్ వసూలుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. 2022, మార్చి 29న నిర్వహించిన వేలంలో ఎవరూ పాల్గొనలేదు. దీంతో ఏడాదిగా మున్సిపల్ సిబ్బందితో తైబజార్ వసూలు చేస్తున్నారు. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈనెల 28న వేలం నిర్వహించారు. ఈసారి కూడా ఎవరూ రాలేదు. దీంతో శుక్రవారం మరోమారు వేలం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈమేరకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈసారైనా కాంట్రాక్టర్లు వస్తారా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈసారి కూడా ఎవరూ హాజరు కాకుంటే ఏం చేస్తారన్న చర్చ జరుగుతోంది. మరోవైపు తైబజార్ వేలం నిర్వహణలో అధికారులు విఫలం కావడంపై అదనపు కలెక్టర్ రాహుల్ అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. త్వరగా వేలం పూర్తి చేయాలని అదేశాలు జారీ చేశారు. దీంతో శుక్రవారం ఎలాగైనా కాంట్రాక్టర్లు హాజరయ్యేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు.
జాప్యానికి కారణం ఇదేనా?
చెన్నూర్ మున్సిపాలిటీలో తైబజార్ వసూలు కోసం 2021 మార్చిలో అధికారులు వేలం నిర్వహించారు. చెన్నూర్‌కు చెందిన కాంట్రాక్టర్ రూ.15.85 లక్షలకు టెండర్ దక్కించుకున్నాడు. 2022 మార్చి నాటికి గడువు ముగిసింది. గడువులోగా మున్సిపాలిటీకి రూ.15.85 లక్షలు చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.4.50 లక్షలు మాత్రమే చెల్లించాడు. దీంతో మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడింది. వేలం సొమ్ము కేవలం ఆరు నెలల్లోనే వసూలయ్యే అవకాశం ఉన్నా కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో డబ్బులు వసూలు చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా మున్సిపల్ పాలకవర్గ సభ్యులు ఒత్తిడితో అధికారులు సదరు కాంట్రాక్టర్‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. ఈ కారణంగానే వేలంలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని సమాచారం.
వేలం నిర్వహిస్తాం..
జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం వేలం పూర్తిచేస్తాం. గతంలో కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించకుండా చేతులు ఎత్తేశాడని తెలిసింది. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ నిబంధనల ప్రకారం.. వేలం సొమ్ములో సగం ముందే చెల్లించాలి. ఈసారి వేలం నిబంధనల ప్రకారం నిర్వహిస్తాం.
– గంగాధర్, మున్సిపల్ కమిషనర్, చెన్నూర్