క్లుప్తంగా

శవమై కనిపించిన వృద్ధుడు

మందమర్రిరూరల్‌: ఈ నెల 12న ఇంటి నుంచి వంట చెరుకు కోసమని బయటకు వెళ్లిన సత్తయ్య గురువారం శవమై కనిపించాడు. ఎస్సై మహేందర్‌ వివరాల ప్రకారం... మండలంలోని చిర్రకుంట గ్రామానికి చెందిన కడియాల సత్తయ్య (62) సమీపంలోని అటవీ ప్రాంతానికి కట్టెల కోసం వెళ్లి తిరిగి రాలేదు. సత్తయ్య అప్పుడప్పుడు ఇంటి నుంచి బయటకు వెళ్లి నాలుగైదు రోజులకు ఇంటికి వచ్చే వాడు. అదే విధంగా వస్తాడని కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. గురువారం గ్రామస్తులు కొందరు అటవీ ప్రాంతానికి వెళ్లగా అక్కడ శవం కనిపించగా పోలీసులకు విషయాన్ని తెలిపారు. సంఘటన స్థలానికి వెళ్లిన ఎస్సై మహెందర్‌ సత్తయ్యగా గుర్తించి వారి కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

తృటిలో తప్పిన ప్రమాదం

వాంకిడి: మండలంలోని సవాతి గ్రామానికి వెళ్లే రహదారిపై ఆర్లీ గ్రామ సమీపంలో పెను ప్రమాదం తప్పింది. మండల కేంద్రం నుండి సవాతి, ధాబా వైపు ప్రయాణికులతో వెళ్తున్న టాటా మ్యాజిక్‌ వాహనం ప్రమాదానికి గురైంది. సుమారు 10 మంది ప్రయాణికులతో వెళ్తున్న సమయంతో దొడ్డిగూడ గ్రామం వైపు నుంచి వాంకిడి వైపునకు వస్తున్న డిబిఎల్‌కు చెందిన ఓ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో టాటా మ్యాజిక్‌ వాహనం స్వల్పంగా దెబ్బతింది. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు.

పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ భవనంలో చోరీ

బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి రాంనగర్‌ బస్తీ ప్రాంతంలో కొత్తగా నిర్మాణం చేసిన పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ భవనంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. అగంతకులు బుధవారం రాత్రి లేదా అంతకన్న ముందుగానే చోరీ చేసినట్లుగా తెలుస్తోంది. భవన నిర్మాణం చేసిన కాంట్రాక్టర్‌ కె.పద్మారెడ్డి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ భవనానికి అమర్చిన 10 టేకు తలుపులు, 14 ఫ్యాన్లు, ఇతర ఎలక్ట్రికల్‌ వస్తువులను గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్లారు. నాలుగేళ్ల క్రితం ఈ భవనాన్ని కాంట్రాక్టర్‌ పద్మారెడ్డి నిర్మాణం చేశారు. ఇంతవరకు పోలీసుశాఖ దీనిని స్వాధీనం చేసుకోలేదు. నిర్మాణం పూర్తయినప్పటి నుంచి ఖాళీగానే ఉంటోంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌ టౌన్‌ ఎస్‌హెచ్‌ఓ టి.శంకరయ్య తెలిపారు.

‘భగత్‌సింగ్‌ స్ఫూర్తితో మతోన్మాదాన్ని అడ్డుకోవాలి’

పాతమంచిర్యాల: భగత్‌సింగ్‌ దేశభక్తిని స్ఫూర్తిగా తీసుకుని దేశంలో మతోన్మాదాన్ని అడ్డుకోవాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు ప్రేంకుమార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని కళాశాల హాస్టల్‌లో స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల 92వ వర్ధంతి గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా, ప్రేంకుమార్‌ మాట్లాడుతూ స్వాతంత్య్రం కోసం చిన్నతనంలోనే పోరాటాలు చేసిన విప్లవ కెరటాలు భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ అన్నారు. ఆ రోజుల్లో సమానత్వం, విద్య, ఉపాధి, హక్కుల కోసం పోరాటం చేస్తే ఈరోజు దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మత ఘర్షణలు, కులాల పేరుతో దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. వీటిని ఎదుర్కొనేందుకు విప్లవ పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. మతోన్మాదం, కుల ఉన్మాదంపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేఽశంలో మతోన్మాదం పెరిగిందని తెలిపారు. యువకుల్లో మతాన్ని నింపి మత ఘర్షణలు సృష్టిస్తున్నారని ఆరోపించారు.

Read latest Mancherial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top