పాఠశాల స్వచ్ఛంద నియామకాల్లో గందరగోళం

● విద్యాశాఖ అప్రమత్తం ● కేర్‌ ఫౌండేషన్‌ లేఖలపై ఆరా

మంచిర్యాలఅర్బన్‌: సర్కారు బడుల్లో స్వచ్ఛంద నియామకాల్లో గందరగోళం ఏర్పడింది. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద సర్కారు బడుల్లో డిజిటల్‌ అసిస్టెంట్‌, ఆఫీస్‌ సబార్డినేట్‌, స్వీపర్‌ నియామకం చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఆదేశాల మేరకు విద్యాంజలి 2.0లో అదానీ ఎడ్యుకేషనల్‌ ఫౌండేషన్‌, ఏపీఎల్‌ హెల్త్‌ కేర్‌ ఫౌండేషన్‌ సంస్థలు అపాయిమెంట్‌ చేసిన వారిని ఉద్యోగులుగా జాయిన్‌ చేసుకోవాల్సి ఉంది. ఇదే అదునుగా భావించి మరో సంస్థ కేర్‌ ఫౌండేషన్‌ పేరిట కొందరికి నియామక ఉత్తర్వులు ఇవ్వడం, చేరడానికి రావడంతో జిల్లా విద్యాశాఖ అప్రమత్తమైంది. కేర్‌ సంస్థ పేరిట జారీ చేసిన నియామక ఉత్తర్వులతో వచ్చిన ఉపాధ్యాయులను చేర్చుకోవద్దని హెచ్‌ఎంలకు డీఈవో వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

నియామకాలపై ఆరా..

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద సర్కారు బడుల్లో అవసరాల మేరకు బోధన, బోధనేతర సిబ్బందిని స్వచ్ఛంద సంస్థలు నియమించా యి. ఫిబ్రవరి 22న ఎనిమిది మంది ఆయా పోస్టుల్లో చేరారు. స్థానిక జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల, బెల్లంపల్లితోపాటు పలు పాఠశాలల్లో అదానీ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ సంస్థ నియమించిన వారు విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం బాలుర ఉన్న త పాఠశాలలో కేర్‌ ఫౌండేషన్‌తో మరో ఇద్దరు రావడంతో విద్యాశాఖకు సమాచారం అందించారు. మందమర్రి పట్టణంలోని ఓ పాఠశాలకు కూడా కేర్‌ ఫౌండేషన్‌ లెటర్‌తో వచ్చినట్లు తెలుస్తోంది. స్వచ్ఛంద నియామకాలు ‘మామూలు’గా సాగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అలాంటి సంస్థ పేరిట వ చ్చిన వారిని చేర్చుకోవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇదివరకు విధుల్లో చేరిన వారిలో ఎవరైనా ఉన్నారా.. అనే దానిపై ఆరా తీశారు. చేరిన వారిని కూడా రిలీవ్‌ చేయాలని డీఈవో వెంకటేశ్వర్లు ఆదేశించారు. పాఠశాలల్లో చేరిన వారి వివరాలు అపాయింట్‌మెంట్‌ లెటర్‌, జాయినింగ్‌ రిపోర్టులను జిల్లా విద్యాశాఖ కార్యాలయం సమన్వయ అధికారి చౌదరికి 83283 63596 నంబరులో అందజేయాలని సూచించారు.

Read latest Mancherial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top