నేడు మహబూబ్‌నగర్ స్థాపన దినోత్సవం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని మీర్ మహెబూబియా హాల్‌లో గురువారం ఉదయం 10 గంటలకు మహబూబ్‌నగర్ స్థాపన వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆరో నిజాం మీర్ మహెబూబ్‌అలీఖాన్ బహదూర్ ఫౌండేషన్ అధ్యక్షుడు అబ్దుల్ రహీం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌నగర్ 135వ స్థాపన వేడుకలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, రిటైర్డ్ ఆర్మీ పాండురంగారెడ్డి, తామీరే మిల్లత్ అధ్యక్షులు మహ్మద్ జియావుద్దీన్ నాయర్ తదితరులు పాల్గొంటారన్నారు. వేడుకల్లో మహబూబ్‌నగర్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
బాదేపల్లి యార్డుకు పోటెత్తిన ధాన్యం
జడ్చర్ల/ దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డుకు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి 17 వేల క్వింటాళ్ల పంట దిగుబడులు విక్రయానికి వచ్చాయి. ఇందులో 15,750 క్వింటాళ్ల ధాన్యం రాగా ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,709, కనిష్టంగా రూ.1,619 ధరలు లభించాయి. హంస రకానికి గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,611, మొక్కజొన్న గరిష్టంగా రూ.1,901, కనిష్టంగా రూ.1,624, పత్తి గరిష్టంగా రూ.6,681, కనిష్టంగా రూ.5,060 చొప్పున పలికాయి. దేవరకద్ర మార్కెట్‌లో ఆర్‌ఎన్‌ఆర్ క్వింటాల్ గరిష్టంగా రూ.2,702, కనిష్టంగా రూ.2,059 చొప్పున ధరలు లభించాయి. కాగా.. దేవరకద్రలో ప్రసన్నాంజనేయస్వామి ఉత్సవాల కోసం గురువారం, చిన్నరాజమూర్ ఆంజనేయస్వామి రథోత్సవం సందర్భంగా శుక్రవారం మార్కెట్‌కు సెలవు ఇచ్చినట్లు మార్కెట్ కార్యదర్శి జయలక్ష్మి తెలిపారు.
దివ్యాంగులకు
చేయూతనివ్వాలి
పాలమూరు/ మహబూబ్‌నగర్ రూరల్: సమాజంలో దివ్యాంగులు అందరితో సమానం అని, వారి పట్ల దయ, జాలితో కాకుండా చేయూతనిచ్చి గౌరవించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఇందిర అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని బుధవారం జిల్లాకేంద్రంలోని బ్రహ్మ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ఆర్‌పీడబ్ల్యూడీ యాక్టు–2016 ప్రకారం దివ్యాంగులను అగౌరవపరిచినా, చిన్నచూపు చూసినా చట్టపరంగా శిక్షలు ఉంటాయన్నారు. యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మురళీకృష్ణ మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు విద్యతోపాటు వారికి కావాల్సిన అవసరాలను గుర్తించి సేవ చేస్తున్న సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు గన్నోజు చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ సుజాత, డైట్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపాల్ శివన్న, పేరెంట్స్ అసోసియేషన్ కార్యదర్శి అంజనేశ్వరి, దివ్యాంగుల హక్కుల పోరాట రాష్ట్ర కార్యదర్శి నరేందర్, జిల్లా అధ్యక్షుడు మధుసూదన్, విజయభాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు.
నేడు మహబూబ్‌నగర్ స్థాపన దినోత్సవం


