
విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలి
మహబూబ్‌నగర్ రూరల్: విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెట్టేలా ఉన్నత లక్ష్యంతో చదువుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని ధర్మాపూర్ గ్రామం మహాత్మ జ్యోతిరావుపూలే బీసీ గురుకుల పాఠశాలలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బాల్య వివాహాల నివారణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల చట్టాలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. స్నేహపూర్వకమైన బాలల న్యాయ సేవల పథకం– 2024 ప్రకారం బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన హక్కులతోపాటు బాధ్యతలు సైతం నిర్వర్తించాలని, విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదువుకోవాలని, 14 ఏళ్లలోపు పిల్లలందరూ బడిలో ఉండాలని సూచించారు. ఉచిత న్యాయ సహాయంతోపాటు బాలల రక్షణ, సంరక్షణపై ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదన్నారు. బాలలు ఏదైనా సమస్య వస్తే 1098, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఫోన్ నంబర్ 15100 ఫోన్ చేస్తే అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపుతారన్నారు. ప్రభుత్వం బాలల హక్కుల పరిరక్షణ కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పిల్లల హక్కులకు భంగం కలగకుండా వారికి సహాయం చేసేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. అనంతరం పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకొని చదువుపై శ్రద్ధ చూపేలా కౌన్సిలింగ్ ఇవ్వడం బాధ్యతగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు సూచించారు. సమావేశంలో ప్రిన్సిపాల్ వెంకటరమణ, వైస్ ప్రిన్సిపాల్ శివ, పారా లీగల్ వలంటీర్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు.