
ఈనెల 31 వరకు ‘ఆపరేషన్ ముస్కాన్’
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఈ నెల 1 నుంచి 31 వరకు చేపట్టే ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా బాల కార్మికులను గుర్తించేందుకు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రెస్క్యూ టీం అధికారులను కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోనీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. 18 ఏళ్లలోపు బాలలు పనిచేస్తున్నట్లు గుర్తించి తీసుకున్న పునరావాస చర్యలపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. ముఖ్యంగా జిల్లాలోని హోటళ్లు, మెకానిక్ షాపులు, నిర్మాణ రంగం, భిక్షాటన, ఇటుక బట్టీలు, ఇతర చోట్ల ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేసే బాల కార్మికులను గుర్తించేందుకు మహిళాశిశు సంక్షేమ శాఖ బాలల సంరక్షణ అధికారి సమన్వయంతో కలిసి రెస్క్యూ టీం అధికారులు తనిఖీలు నిర్వహించాలన్నారు. బాల కార్మిక నిర్మూలన చట్టం–2016 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. బాల కార్మికుల పిల్లలను బాలల సంరక్షణ కమిటీకి అప్పగించి వారి సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలలు పాఠశాల, కళాశాలల్లో ఉండాలని, పనిలో ఉండవద్దని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, ఏఎస్పీ రత్నం, జిల్లా మహిళా, శిశు సంక్షేమాధికారి జరీనాబేగం, మైనార్టీ సంక్షేమాధికారి శంకరాచారి తదితరులు పాల్గొన్నారు.