
చదువుతోనే అభివృద్ధి సాధ్యం
రాజాపూర్: చదువుతోనే అభివృద్ధి సాధ్యమతుందని.. గ్రామీణ పిల్లలకు ఉత్తమ విద్య అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పీఎంశ్రీ నిధులను పాఠశాలల నిర్మాణాలకు కేటాయిస్తున్నారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ నిధులు రూ.54 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డితో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్దేశించుకొని అందుకు అనుగుణంగా కష్టపడి చదవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం మొదటి, రెండవ ఫేస్‌లో రాష్ట్రానికి రూ.4.50 లక్షల కోట్లు పీఎంశ్రీ నిధులు కేటాయించిందని వివరించారు. అనంతరం ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బోధన అందిస్తారని.. కావాల్సిన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. చిన్నప్పటి నుంచే కంప్యూటర్ విద్యను అందించేందుకు ఏఐ విద్యాబోధనను ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తుందని వివరించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు తమవంతుగా బూట్లు పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సుధాకర్, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, నాయకులు నరహరి, ఆనంద్, శ్రీనివాస్‌నాయక్, శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రామకృష్ణ, గోవర్ధన్‌రెడ్డి, విక్రంరెడ్డి, రమణ, నసీర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ