వృద్ధులు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

వృద్ధులు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

Jul 3 2025 4:50 AM | Updated on Jul 3 2025 4:50 AM

వృద్ధ

వృద్ధులు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

మహబూబ్‌నగర్‌ రూరల్‌: వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిలో అందిన దరఖాస్తులు సంబంధిత అధికారులు సత్వరం పరిష్కరించాలని కలెక్టర్‌ విజయేందిర అన్నారు. ప్రతినెలా మొదటి బుధవారం మహబూబ్‌నగర్‌ అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో వయోవృద్ధులు, దివ్యాంగులకు నిర్వహించిన ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొని వృద్ధులు, దివ్యాంగుల నుంచి 19 దరఖాస్తులు స్వీకరించారు. గత నెల ప్రజావాణి సందర్భంగా వచ్చిన సమస్యల పరిష్కారంపై కలెక్టర్‌ ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పెండింగ్‌ దరఖాస్తులు ఆయా శాఖల అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారి జరీనాబేగం గతంలో వచ్చిన ఫిర్యాదులపై సమగ్రంగా వివరించారు. అంతకు ముందు కలెక్టరేట్‌లో సమాచార, సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలని, కలెక్టరేట్‌ ఎదుట రెండు వైపులా బస్‌షెల్టర్‌ నిర్మించాలని, స్థానిక పద్మావతీ కాలనీ ఉన్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాన్ని మార్చాలని సీనియర్‌ సిటిజన్‌ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, అర్బన్‌ తహసీల్దార్‌ ఘన్సీరాం, డిప్యూటీ తహసీల్దార్‌ దేవేందర్‌ కేసిరెడ్డి, ఆర్టీసీ డీఎం సుజాత, సీనియర్‌ సిటిజన్‌ ఫోరం ఉపాధ్యక్షుడు రాజసింహుడు, ప్రధాన కార్యదర్శి నాగభూషణం, బాలయ్య, మనోహర్‌రావు, కోటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు పీయూకు

విద్యా కమిషన్‌ రాక

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: పాలమూరు యూనివర్సిటీకి గురువారం రాష్ట్ర విద్యా కమిషన్‌ రానుందని పీయూ రిజిస్ట్రార్‌ రమేష్‌బాబు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషన్‌ ఏర్పడిన తర్వాత పాలమూరు యూనివర్సిటీలో మొట్టమొదటిసారి ‘విద్యా బలోపేతంపై అభిప్రాయ సేకరణ’ అనే అంశంపై కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. పీయూ ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో కార్యక్రమం జరుగుతుందని, ఇందులో విద్యా కమిషన్‌ చైర్‌పర్సన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి, కమిషన్‌ మెంబర్స్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, చారకొండ వెంకటేష్‌, జ్యోష్నశివారెడ్డి, పీయూ వైస్‌ చాన్స్‌లర్‌ శ్రీనివాస్‌ పాల్గొంటారన్నారు. ఇందుకు సంబంధించి పీయూ పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు, నాన్‌టీచింగ్‌ సిబ్బంది, విద్యార్థి సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారన్నారు. ఇందులో విద్యా బలోపేతం, బోధన లోపాలు, వసతుల కల్పన తదితర అంశాలను కమిషన్‌కు తెలియజేస్తే వారు రిపోర్టు రూపంలో ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ప్రిన్సిపాళ్లు కరుణాకర్‌రెడ్డి, రవికాంత్‌, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

స్వరాష్ట్రంలోనూ

పాలమూరుకు అన్యాయం

పాలమూరు: ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా సాగునీటి సమస్యలపై పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ రాఘవాచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు సెషన్లలో సదస్సు ఉంటుందని, మొదటి సెషన్‌లో ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ప్రారంభ ఉపన్యాసం చేస్తారన్నారు. మూడు సెషన్లలో ఎంతో మంది వక్తలు సమస్యలపై ఉపన్యాసాలు ఇస్తారన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మేధావులు, ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి.. తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. తెలంగాణ ఏర్పాటు జరిగిన ఇంకా జల వనరుల దోపిడీ ఆగలేదని, స్వరాష్ట్రంలో కూడా జిల్లా వివక్షకు గురవుతుందన్నారు. సాగునీటి కల్పనలో జిల్లాకు అన్యాయం జరిగిందని, కృష్ణానది నీటిలో న్యాయమైన వాటా ఇవ్వలేదని ఆరోపించారు.

వృద్ధులు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
1
1/1

వృద్ధులు, దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement