
6న కురుమూర్తిస్వామికి లక్ష పుష్పార్చన
చిన్నచింతకుంట: ఉమ్మడి పాలమూరు వాసుల ఆరాధ్యదైవమైన అమ్మాపురం కురుమూర్తిస్వామి ఆలయంలో శయనేకాదశి (తొలి ఏకాదశి)ని పురస్కరించుకొని ఆదివారం స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ సిబ్బంది స్వామివారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో రకరకాల పూలతో అలంకరిస్తారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలకు పట్టువస్త్రాలు ధరింపజేసి అలంకరణ మండపంలో ఉంచుతారు. ఈ ఉత్సవంలో వివిధ గ్రామాలకు చెందిన దంపతులు జంటగా పాల్గొంటారు. ఆలయ అర్చకుల వేద మంత్రోచ్ఛరణాలతో అమ్మవార్లకు పుష్పార్చన ఘనంగా కొనసాగనుంది. కార్యక్రమానికి ఉమ్మడి పాలమూరు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
ఇవీ కార్యక్రమాలు..
తొలి ఏకాదశిని పురస్కరించుకొని కురుమూర్తిస్వామి ఆలయంలో ఆది, సోమవారాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆదివారం ఉదయం 6 గంటలకు సుప్రభాతసేవ, 6.30 గంటలకు స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం, 9 గంటలకు విశ్వక్‌సేవ పూజ, పుణ్యాహవచనం, 10 గంటలకు స్వామివారికి లక్ష పుష్పార్చన, రాత్రి 7 గంటలకు అమ్మవారికి కుంకుమార్చన, 8 గంటలకు ప్రదోషకాల పూజ, 9 గంటలకు తీర్థ ప్రసాద వితరణ, 10 గంటలకు అఖండ భజన ఉంటుంది. అలాగే సోమవారం ఉదయం 7 గంటలకు సహస్ర నామార్చన, 9 గంటలకు మహానివేదన, 9.30 గంటలకు తీర్థప్రసాద వితరణ చేపడుతారు.
● తొలి ఏకాదశిని పురస్కరించుకొని కురుమూర్తిస్వామికి సహస్ర పుష్పార్చన జరిపించే భక్తులు ఆలయ కార్య నిర్వహణాధికారి కార్యాలయంలో రూ.151 చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకోవాలని ఈఓ మధనేశ్వర్‌రెడ్డి, చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి కోరారు.
కురుమూర్తిస్వామి ప్రధాన ఆలయం