
చేనేత కార్మికులకు జియోట్యాగ్ నంబర్లు
అమరచింత: మగ్గాలపై ఆధారపడి జీవిస్తున్న నేత కార్మికులందరికి ప్రభుత్వం జియోట్యాగ్ నంబర్లు జారీ చేస్తూ సంక్షేమ పథకాలు అందించడానికి సిద్ధంగా ఉందని చేనేత జౌళిశాఖ ప్రాంతీయ ఉప సంచాలకులు పద్మ వెల్లడించారు. మండల కేంద్రంలోని చేనేత ఉత్పత్తుల సంఘంలో చేనేత మగ్గాలపై జీవనం పొందుతూ జియోట్యాగ్ నంబర్ కోసం దరఖాస్తు చేసుకున్న కార్మికులను ఆమె బుధవారం ఆకస్మికంగా సందర్శించి కార్మికుల వివరాలు సేకరించారు. ఈ మేరకు అక్కడే ఉండి మగ్గాలపై జరీ చీరలను తయారు చేస్తున్న దరఖాస్తుదారులతో మాట్లాడారు. కొంతకాలంగా మగ్గాలను వదిలామని, ప్రస్తుతం స్థానికంగా ఉపాధి ఉండటంతో మళ్లీ మగ్గాలపై నేత పనులను చేపడుతున్నామని, తమకు జియోట్యాగ్ నంబర్లు కేటాయించి ఆదుకోవాలని నేత కార్మికులు కోరారు. దీంతో ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికీ జియోట్యాగ్ నంబర్‌ను కేటాయిస్తామన్నారు. గద్వాల ఏడీ పరిధిలోని గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లా వ్యాప్తంగా గత ఆరు నెలల కిందట జియోట్యాగ్ కోసం 200 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. దీంతో నేరుగా వృత్తిలో ఉన్నారా లేదా అనే వివరాలను తెలుసుకోనేందుకు మాచర్ల, అరగిద్ద, గోర్లకాన్ దొడ్డి, అమరచింత గ్రామాలను సందర్శించినట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నేత పనులతో ఉపాధి పొందుతున్న కార్మికుడు తనకు జియోట్యాగ్ నంబర్ కావాలంటే కనీసం నేత పనుల్లో 6 నెలల అనుభవం ఉండాలని సూచించారు. 6 నెలల కిందట కొత్తగా జియోట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను పూర్తి స్థాయిలో పరిశీలించామని, త్వరలోనే వారికి నంబర్లను కేటాయిస్తామన్నారు. గద్వాల చేనేత జౌళిశాఖ కార్యాలయం పరిధిలో జియోట్యాగ్ నంబర్లు కలిగిన కార్మికులు 2800 మంది ఉన్నారని వెల్లడించారు. కార్యక్రమంలో చేనేత జౌళిశాఖ ఏడీ గోవిందయ్య, పీల్డ్ ఆఫీసర్ ప్రియాంక ఉన్నారు.
చేనేత జౌళిశాఖ రాష్ట్ర ఉప
సంచాలకులు పద్మ