
దేవుడి భూమిని క్రీడా మైదానంగా మార్చే యత్నం
జోగుళాంబ శక్తిపీఠం: అలంంపూర్ జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి విలువైన భూములను క్రీడా మైదానంగా మార్చే కుట్రను ఈఓ పురేందర్‌కుమార్ అడ్డుకున్నారు. వివరాలిలా.. ఏపీలోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం సర్వే నం.346/1, 346/3లో 15.35 ఎకరాలు ఉండగా.. దేవస్థానం వారు వ్యవసాయం నిమిత్తం లీజుకు ఇచ్చారు. కర్నూలు జిల్లాకు చిట్టచివర ఊల్చాలకు వెళ్లే దారిలో ఉండటంతో కొంతమంది క్రీడాకారులు టోర్నమెంట్ కోసం ఈ భూమిపై కన్నేశారు. ఈ మేరకు క్రికెట్ గ్రౌండ్‌గా మార్చేందుకు మూడు రోజుల క్రితం 8 అడుగుల వెడల్పు 22 అడుగుల పొడవుతో సిమెంట్ బెడ్ వేశారు. దీంతో ఈ భూమిని కౌలుకు తీసుకున్న వ్యక్తి ఆలయం వారికి సమాచారం ఇవ్వడంతో ఈఓ పురేందర్‌కుమార్ శుక్రవారం అక్కడికి వెళ్లి పరిశీలించారు. వెంటనే జేసీబీతో ఆలయ భూమిలో వేసిన సీసీ బెడ్‌ను తొలగించారు. అయితే కొంతమంది క్రీడాకారులు దీనిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా పూర్తిగా తొలగించి వేయించారు. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
సీసీ బెడ్‌ను తొలగించిన
ఈఓ పురేందర్‌కుమార్