తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ | Sakshi
Sakshi News home page

తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ

Published Sun, May 5 2024 2:45 AM

తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ

మరికల్‌: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు కూతవేటు దూరంలో ఉన్న ఓ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. వివరాలిలా.. మరికల్‌కు చెందిన కుర్వ గౌడపోళ్ల రాములు కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి భోజనం చేసిన అనంతరం ఇంటికి తాళం వేసి, ఆరుబయట నిద్రించారు. అర్ధరాత్రి సమయంలో ఇంటి ఆవరణలోకి చొరబడ్డ వ్యక్తులకు కిటికీ వద్ద తాళాలు కనిపించడంతో ఎలాంటి శబ్ధం రాకుండా తలుపులను తెరిచి, లోపలికి ప్రవేశించారు. బీరువాలో ఉన్న 40 తులాల బంగారం ఆభరణాలు, రూ. 10 లక్షల నగదును అపహరించారు. అనంతరం ఇంటి తాళాలను యథావిధిగా కిటికీ వద్ద ఉంచి, అక్కడి నుంచి పరారయ్యారు. ఉదయం నిద్రలేచిన కుటుంబ సభ్యులు తాళంతీసి ఇంట్లోకి వెళ్లగా.. బీరువా తెరిచి ఉండటాన్ని చూసి ఆందోళనకు గురయ్యారు. బీరువాలో దాచిన 40 తులాల బంగారం, రూ. 10 లక్షల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎస్పీ విచారణ..

విషయం తెలుసుకున్న ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ మరికల్‌కు చేరుకొని విచారణ నిర్వహించారు. కుటుంబ యాజమాని గౌడపోళ్ల రాములుతో వివరాలు సేకరించడంతో పాటు ఇంట్లోని బీరువా వద్ద చెల్లాచెదురుగా పడేసిన దుస్తులు ఇతర సామగ్రిని పరిశీలించారు. ఎస్పీ వెంట డీఎస్పీ లింగయ్య, సీఐ రాజేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు మురళి, కుర్మయ్య, భాగ్యలక్ష్మీరెడ్డి ఉన్నారు. బాధిత ఇంటి పరిసరాలను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. క్లూస్‌ టీంతో వివరాలు సేకరించారు. అనంతరం డాగ్‌స్క్వాడ్‌ను రప్పించగా.. బాధిత ఇంటి నుంచి కల్లు దుకాణం వద్దకు వెళ్లి తిరిగివచ్చింది.

మూడు రోజుల్లో బ్యాంకులో

పెట్టాలనుకున్నాం..

ఈనెల 6న గుడిగండ్లలో జరిగే బీరప్ప బండారు ఉత్సవాల అనంతరం 40 తులాల బంగారం ఆభరణాలను బ్యాంకులో భద్రపర్చాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. అలాగే ఓ ప్లాట్‌కు ఇవ్వాల్సిన రూ. 10 లక్షలు కూడా బీరువాలో భద్రపర్చారు. అంతలోనే చోరీ జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

40 తులాల బంగారం,

రూ. 10 లక్షలు అపహరణ

ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌

Advertisement
 
Advertisement