సేవాలాల్‌ ఆలయంలో ‘మహాభోగ్‌’ | Sakshi
Sakshi News home page

సేవాలాల్‌ ఆలయంలో ‘మహాభోగ్‌’

Published Fri, May 24 2024 12:45 AM

సేవాల

గుత్తి రూరల్‌: దేశంలోని 15 కోట్ల బంజారాలు తమదైన సంసృతి, సంప్రదాయాలను విస్మరించకుండా కాపాడుకోవాలని బంజారా సేవా కల్చర్‌ ఆర్గనైజర్‌ ఎస్‌కే రామచంద్ర నాయక్‌ పిలుపునిచ్చారు. వైశాఖ పౌర్ణమిని పురస్కరించుకొని గుత్తి మండలం సేవాగఢ్‌లో సేవాలాల్‌ మహారాజ్‌ ఆలయంలో గురువారం భక్తి శ్రద్ధలతో మహాభోగ్‌ కార్యక్రమం నిర్వహించారు. అర్చకుడు మారుతీప్రసాద్‌ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సేవా కల్చర్‌ ఆర్గనైజర్‌ రామచంద్ర నాయక్‌, సభ్యులు సుబ్రహ్మణ్యం నాయక్‌, రూపానాయక్‌ మాట్లాడుతూ... దేశంలోని బంజారాలు ఏకతాటిపైకి వచ్చి చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ భక్తి మార్గంలో నడవాలన్నారు. క్రాంతికారి సేవాలాల్‌ మహారాజ్‌ ధర్మ బోధనలను విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. ఆదర్శవంతమైన కట్టుబాట్లు, వివాహ శుభకార్యాలు, ఇతర వేడుకలను బంజారా సంప్రదాయ రీతిలో మాత్రమే జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన క్రాంతి చౌహాన్‌, రమేష్‌ రాథోడ్‌, బాలాజీ నాయక్‌, వెంకటరమణనాయక్‌, గోవిందమ్మ పాల్గొన్నారు.

గుత్తి కోట అద్భుతం

సందర్శించిన హైకోర్టు ప్రభుత్వ ప్లీడర్‌

గుత్తి: గుత్తి కోట చాలా అద్భుతంగా ఉందని రాష్ట్ర హైకోర్టు స్పెషల్‌ గవర్నమెంట్‌ ప్లీడర్‌ కాసా జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గుత్తి కోటను గురువారం ఆయన సందర్శించారు. కోటలోని ఏనుగు, గుర్రపు శాలలు, చీకటి గదులు, రంగ మంటపం, బావులు, ఆలయాలు తదితర చారిత్రక కట్టడాలను వీక్షించారు. గైడ్‌ రమేష్‌ ఆయనకు కోట ప్రాముఖ్యతను వివరించారు. కాసా జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ... కోటలోని కట్టడాలు చాలా బాగున్నాయన్నారు. మరోసారి కుటుంబసభ్యులతో కలసి గుత్తి కోట సందర్శనకు వస్తానన్నారు. కార్యక్రమంలో గుత్తి కోట సంరక్షణ సమితి అధ్యక్షుడు విజయ భాస్కర్‌, హైకోర్టు న్యాయవాది శ్రీధర్‌, టీచర్‌ రఘురాం పాల్గొన్నారు.

పిచ్చికుక్క స్వైర విహారం

గుత్తి: పట్టణంలో బుధవారం అర్ధరాత్రి ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కూరగాయల మార్కెట్‌ కాలనీలో ఆరు బయట నిద్రిస్తున్న ఎనిమిది మందిని కరిచి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన వారిలో వెంకట్రాముడు, నారమ్మ, ఇర్ఫాన్‌, పవన్‌, బాషా, సాదిక్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. క్షతగాత్రులు స్థానిక ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందారు. ముఖంపై తీవ్ర గాయాలైన వెంకట్రాముడు, నారమ్మను మెరుగైన వైద్యం కోసం అనంతపురానికి రెఫర్‌ చేశారు. కాగా, వీధిలో సంచరిస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురి చేసిన పిచ్చికుక్కను కొందరు యువకులు కర్రలతో మోది చంపేశారు.

సేవాలాల్‌ ఆలయంలో ‘మహాభోగ్‌’
1/1

సేవాలాల్‌ ఆలయంలో ‘మహాభోగ్‌’

Advertisement
 
Advertisement
 
Advertisement