వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య

Published Fri, May 24 2024 1:45 AM

వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురి ఆత్మహత్య

జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఒకే రోజు ముగ్గురు బలవన్మరణానికి పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు అనంతపురం శివారులో, మరొకరు తాడిపత్రిలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు.

అనంతపురం సిటీ/తాడిపత్రి: స్థానిక 44వ జాతీయ రహదారి సమీపంలోని నేషనల్‌ పార్క్‌ సమీపంలో రైలు కింద పడి అనంతపురంలోని తపోవనం ప్రాంతానికి చెందిన పోరెడ్డి సాంబశివారెడ్డి(44) గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 9 గంటలకు ఇంటి నుంచి బైక్‌పై బయలుదేరిన ఆయన పట్టాల పక్కన తన ద్విచక్ర వాహనాన్ని ఆపి రైలు కింద పడి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆయన ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

● గార్లదిన్నె–తాటిచెర్ల మధ్య బుధవారం అర్ధరాత్రి రైలు కింద పడి శింగనమల మండలం ఆకులేడు గ్రామానికి చెందిన వడ్డే రాజు(26) ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతుడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండేవాడని, ఈ క్రమంలోనే తాగుడుకు బానిసైనట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కుటుంబ పోషణ పట్టించుకోకుండా తరచూ కుటుంబసభ్యులతో గొడవపడేవాడని, ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి పెంచుకున్న ఆయన రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు. మృతుడికి భార్య శ్రీవాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ రెండు ఘటనలపై జీఆర్‌పీ ఎస్‌ఐ విజయకుమార్‌ కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

● తాడిపత్రికి చెందిన టౌన్‌ బ్యాంక్‌ విశ్రాంత మేనేజర్‌ దద్దం శ్రీనివాసరావు (62) బుధవారం అర్దరాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. గతంలో చైన్నెలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆయనకు కాళ్లు విరిగాయి. కోలుకునేందుకు చాలా కాలం పట్టింది. పూర్తి స్థాయిలో ఆరోగ్యం కుదుటపడకపోవడంతో మానసికంగా కుదేలయ్యారు. ఈ క్రమంలో కర్నూలులోని ఓ సైక్రియాటిస్ట్‌ వద్ద కుటుంబసభ్యులు చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే జీవితంపై విరక్తి పెంచుకున్న ఆయన బుధవారం రాత్రి ఆటో నగర్‌ సమీపంలోని పట్టాలపై చేరుకుని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య విజయలక్ష్మి ఉన్నారు. ఈ ఘటనపై జీఆర్పీ ఎస్‌ఐ నాగప్ప కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
 
Advertisement