ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి | Sakshi
Sakshi News home page

ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి

Published Fri, May 24 2024 12:45 AM

ఉక్కప

● దీనికి ఉష్ణతాపం తోడు ● గాలిలో తేమ శాతం అధికం కావడమే కారణం ● అసౌకర్య వాతావరణంతో ఇబ్బంది పడుతున్న నగర ప్రజలు

సాక్షి, విశాఖపట్నం : ఉక్కపోత జనాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఒకపక్క ఉష్ణతాపం ఇబ్బంది పెడుతుంటే.. అది చాలదన్నట్టు ఉక్కపోత దానికి తోడైంది. ఫలితంగా ఈ రెండూ జత కలిసి ముచ్చెమటలు పోయిస్తున్నాయి. ఉదయం పొద్దెక్కగానే అసౌకర్య వాతావరణం మొదలవుతోంది. ఎండ ముదిరే కొద్దీ ఉక్కపోత కూడా అధికమవుతోంది. సాయంత్రం సూర్యాస్తమయం అయినా వేడి తగ్గినా ఉపశమనం కలగడం లేదు. పలువురు తమ ఇళ్లలో ఏసీలు, ఫ్యాన్లు రేయింబవళ్లు ఆపడం లేదు. ఇళ్లు, కార్యాలయాల్లో ఫ్యాన్లు గిరాగిరా తిరుగుతున్నా ఏమంత ఫలితం ఉండడం లేదు. వీటి నుంచి బయటకు రాగానే చెమటతో తడిసి ముద్దవుతున్నారు. సాధారణంగా గాలిలో తేమ 50 శాతానికి లోపు ఉంటే ఉక్కపోత ప్రభావం కనిపించదు. కానీ అంతకు పైగా నమోదైతే మాత్రం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో గాలిలో తేమ 60–70 శాతం వరకు ఉంటోంది. గురువారం విశాఖలో గాలిలో తేమ 68 శాతం ఉంది. మరో మూడు, నాలుగు రోజులు ఈ తేమ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో ఉక్కపోత మరింత తీవ్రం కానుంది. అప్పటి వరకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించే అవకాశం లేదు.

ఎందుకిలా?

సాధారణంగా మైదాన ప్రాంతాలకంటే సముద్ర తీర ప్రాంతాలో ఉక్కపోత అధికంగా ఉంటుంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. ఇది వాయుగుండం, ఆపై తుపానుగాను బలపడనుంది. బంగాళాఖాతంలో ఇలాంటివి ఏర్పడినప్పుడు భూ ఉపరితలంలోని గాలులను అటు వైపు లాక్కుంటాయి. దీంతో ఉక్కపోత ప్రభావం మరింతగా పెరుగుతుంది. ప్రస్తుతం ఉక్కపోత పెరగడానికి ఇదే ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి
1/1

ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి

Advertisement
 
Advertisement
 
Advertisement