
ఒకే కుటుంబంలో ఇద్దరి మృతి
పెద్దవంగర: ఆర్థిక సమస్యలతో కోడలు ఆత్మహత్య చేసుకోగా.. ఆమె మరణ వార్త విన్న మామ గుండెపోటుతో మృతి చెందిన ఘటన మండలంలోని అవుతాపురంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మేముల సంతోష్‌కు 2011లో మంచిర్యాలకు చెందిన ఝాన్సీ(30)తో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు అఖిల్ తేజ, అభిదామిని ఉన్నారు. సంతోష్ స్థానికంగా సీఆర్పీగా పని చేస్తుండగా, ఝాన్సీ తొర్రూరులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీచర్‌గా విధులు చేపడుతుంది. కాగా, ఆర్థిక సమస్యలు తలెత్తడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఝాన్సీ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గుర్తించి వెంటనే తొర్రూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కోడలు మరణ వార్త విన్న మామ వేముల లక్ష్మ య్య(70) తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాడు. కుమారుడు సంతోష్ ఒంటరివాడు అయ్యాడని, మనుమడు, మనుమరాలు తల్లిలేని వారయ్యారని కలత చెందాడు. ఇంటికి తిరిగి వెళ్లిన కొద్ది సేపటికే గుండె నొప్పిగా ఉందని భార్య సరోజనతో చెప్పాడు. ఆమె సపర్యలు చేసేలోపే గుండెపోటుతో లక్ష్మయ్య మృతి చెందాడు. కాగా,కొన్ని గంటల వ్యవధిలోనే ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఝాన్సీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వర్ధన్నపేటకు తరలించారు. ఈ సంఘటనపై ఎస్సై క్రాంతి కిరణ్‌ను వివరణ కోరగా ఇంకా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
ఆర్థిక సమస్యలతో కోడలి ఆత్మహత్య
ఆమె మరణ వార్త విని
గుండెపోటుతో మామ మృతి
అవుతాపురంలో విషాదఛాయలు