
తాళాలు వేసి ఉన్న క్వార్టర్స్ టార్గెట్‌గా..
గణపురం : తాళాలు వేసి ఉన్న క్వార్టర్స్ టార్గెట్‌గా కేటీపీపీలో భారీ చోరీ జరిగింది. పటిష్ట భద్రత కలిగి ఉండే జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీపీ) క్వార్టర్స్‌లో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. ఈ ఘటనలో రూ. 3.10 లక్షల నగదుతో పాటు కొన్ని విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు సమాచారం. చోరీ జరిగిన క్వార్టర్స్‌లో ఎవరూ లేకపోవడంతో మంగళవారం ఉదయం గుర్తించిన చుట్టుపక్కల వారు బాధితులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అందుబాటులో ఉన్న కొంత మంది ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్వార్టర్స్ నంబర్ సీ9, సీ12, డీ12, డీ37, డీ40, డీ55, డీ117, ఈ6, ఈ 56, ఈ79 బ్లాక్‌లలో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఇందులో డీ12 క్వార్టర్స్‌లోని ఏడీఈ వంశీధర్ ఇంట్లో రూ. 3 లక్షల నగదు, డీఈ తిరుపతి గౌడ్ ఇంట్లో రూ. 10వేల నగదు చోరీ గురైందని ఫిర్యాదు చేశారు. మిగతా ఉద్యోగుల క్వార్టర్స్‌లలో విలువైన ఆభరణాలు పోయినట్లు సమాచారం. మిగతా వారు వచ్చి తమ క్వార్టర్స్‌లలో ఏ వస్తువు చోరీ జరిగిందో చూస్తే తప్ప పూర్తి వివరాలు తెలియదు. ఘటనా స్థలిని భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, చిట్యాల సీఐ మల్లేశ్, గణపురం ఎస్సై అశోక్ పరిశీలించి ఆధారాలు సేకరించారు.
24 గంటలు భద్రత.. చోరీ ఎలా జరిగింది?
కేటీపీపీ క్వార్టర్స్‌లో సుమారు వెయ్యి మందికి పైగా ఉద్యోగుల కుటుంబాలు నివాసముంటున్నాయి. ఇందులో సీఈ స్థాయి నుంచి ఎస్‌ఈలు, డీఈలు, ఎడీఈలు, ఇంజనీర్లు, జేపీఏ,ఆర్టిజన్‌లు కుటుంబాలతో నివాసముంటున్నారు. ఇక్కడ జెన్‌కో సెక్యూరిటీ బయటి వారిని లోపలికి వెళ్లకుండా ప్రతి క్షణం రక్షణ చర్యలు తీసుకుంటుంది. ప్రతీ కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కానీ ఇంత భద్రత ఉన్నా ఒకే రాత్రి 10 క్వార్టర్స్‌లో చోరీ జరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెక్యూరిటీ విభాగం కాలనీల్లో గస్తీ నిర్వహిస్తారు. అయినా బయటి వారు ఎలా లోపలికి చొరబడ్డారు. తాళాలు వేసి ఉన్న క్వార్టర్స్‌నే ఎలా గుర్తించారు. ఇదేమైనా ఇంటి దొంగల పనేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి కేటీపీపీలో ఒకే రోజు 10 క్వార్టర్స్‌లో చోరీ జరగడం సంచలనంగా మారింది. ఈ చోరీని పోలీసులు ఎలా ఛేదిస్తారో వేచి చూడాలి.
కేటీపీపీలో భారీ చోరీ
ఒకే రాత్రి 10 ఇళ్లలో రూ.3.10 లక్షల నగదు అపహరణ
పటిష్ట భద్రత ఉన్నా చోరీ జరగడంపై అనుమానాలు
ఘటనా స్థలిని పరిశీలించిన డీఎస్పీ సంపత్ రావు