
నారాయణపురం రైతుల రిలే నిరాహార దీక్ష
కేసముద్రం: ఎంజాయ్‌మెంట్ సర్వే ప్రకారం తమకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామ రైతులు మంగళవారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ ధారావత్ రవితోపాటుపలువురు రైతులు మాట్లాడుతూ.. 2017లో గత ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న 1,827 ఎకరాల పట్టాభూములను అటవీ భూములుగా పేర్కొంటూ తమ పట్టాలను రద్దు చేసిందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీఓ 94 జారీ చేసి రైతు పేరు, తండ్రి పేరు చోట వస్తున్న ‘అడవి’ అనే పదం తొలగించిందన్నారు. ఆ తర్వాత తమ గ్రామంలో అధికారులు ఎంజాయ్‌మెంట్ సర్వే నిర్వహించారన్నారు. ఈ సర్వే ఆధారంగా తమకు పట్టాదార్ పాస్ పుస్తకాలు అందించాలని డిమాండ్ చేశారు. 2022 నుంచి టీఎం 33 మాడ్యుల్‌లో 145 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరిస్తే సుమారు 500 ఎకరాలకు పట్టాదార్ పాస్ పుస్తకాలు వచ్చే అవకాశం ఉన్నా రెవెన్యూ అధికారులు జా ప్యం చేస్తున్నారని ఆరోపించారు. 7 ఏళ్లుగా పాస్‌పుస్తకాలు లేకపోవడంతో తామకు ప్రభుత్వ పథకాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పాస్‌పుస్తకాలు అందించాలని, లేనిపక్షంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో రైతులు లక్ష్మీపతి, వెంకట్‌రెడ్డి, నర్సింహారెడ్డి, అమరేందర్‌రెడ్డి, లచ్చు, భీమా, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సర్వే ప్రకారం పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్