కేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలోని కేసముద్రంవిలేజ్ జెడ్పీ హైస్కూల్‌లోని జిల్లా పాఠ్యపుస్తకాల గోదాంను ఆర్‌జేడీ సత్యనారాయణరెడ్డి బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు ఇప్పటి వరకు వచ్చిన పుస్తకాలను ఆయన పరిశీలించారు. జిల్లా పాఠ్యపుస్తకాల మేనేజర్ చీకటి వెంకట్రాంనర్సయ్యకు పలు అంశాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆయన వివరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. ఈనెల 20నుంచి జిల్లాలోని వివిధ మండలాలకు పుస్తకాలు పంపిణీ జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 2,21,880 పాఠ్యపుస్తకాలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.
పుష్కరాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
నెహ్రూసెంటర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ నెల 15 నుంచి 26వరకు జరగనున్న సరస్వతీ పుష్కరాలకు మహబూబాబాద్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ బుధవారం తెలిపారు. మహబూబాబాద్ నుంచి కాళేశ్వరానికి పెద్దలకు రూ. 400, పిల్లలకు రూ. 210గా బస్సు చార్జీలు నిర్ణయించినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణించి పవిత్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించాలని ఆయన కోరారు. ప్రయాణికులు, ప్రజలు ఈ అవకాశాలన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలి
డోర్నకల్: డోర్నకల్ రైల్వే జంక్షన్ మీదుగా రద్దయిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని డీఆర్‌యూసీసీ సభ్యుడు లక్ష్మణ్‌నాయక్ కోరారు. సికింద్రాబాద్ రైలు నిలయంలో బుధవారం దక్షిణ మధ్యరైల్వే డివిజనల్ మేనేజర్ అరుణ్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌నాయక్ మాట్లాడుతూ.. డోర్నకల్ మీదుగా నడిచే ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని, ముఖ్యంగా కాజీపేట–విజయవాడ(337–338) ప్యాసింజర్ రైలును వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
కురవిలో చెక్ పోస్టు ఏర్పాటు
కురవి: మండల కేంద్రంలోని జాతీయ రహదారి–365పై పెట్రోల్ బంక్ వద్ద కురవి పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును బుధవారం రాత్రి మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య ప్రారంభించారు. జూన్ 6న బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమంగా పశువుల రవాణా జరగకుండా ఉండేందుకు చెక్ పోస్ట్‌ను ఏర్పాటు చేసినట్లు సీఐ సర్వయ్య తెలిపారు. కార్యక్రమంలో ఎస్సై గండ్రాతి సతీశ్, పీఎస్సై కృష్ణారెడ్డి, ఏఎస్సై వెంకన్న, సిబ్బంది జానిమియా, కాశీరాం, హరిబాబు పాల్గొన్నారు.

జిల్లా పాఠ్యపుస్తకాల గోదాం సందర్శన