బ్రెయిన్ ట్యూమర్‌తో పీహెచ్‌డీ విద్యార్థి మృతి
తుగ్గలి : బ్రెయిన్ ట్యూమర్‌తో తుగ్గలి మండలం మిద్దెతండాకు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి ఆర్ జయప్రకాష్‌నాయక్(30) మృతి చెందారు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు..తండాకు చెందిన చిన్న హేమ్లా నాయక్, లక్ష్మిదేవి దంపతులకు ఇద్దరు కుమారులు. కండక్టర్ ఉద్యోగం రీత్యా కొన్నేళ్ల క్రితమే హేమ్లానాయక్ తండా వదిలాడు. ప్రస్తుతం ఎమ్మిగనూరు ఆర్టీసీ డిపోలో పని చేస్తున్నారు. పెద్ద కుమారుడైన జయప్రకాష్ నవోదయ విద్యార్థి, ఇంటర్ విజయవాడ, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం కొనసాగించారు. జియాలజీలో రెండో సంవత్సరం పీహెచ్‌డీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఏడాదిన్నర క్రితం బ్రెయిన్ ట్యూమర్ బారిన పడిన జయప్రకాష్‌కు తల్లిదండ్రులు విశాఖపట్నం, చైన్నె, హైదరాబాద్‌లో లక్షలు ఖర్చుచేసి వైద్యం చేయించారు. మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కర్నూలులోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందినట్లు తండ్రి తెలిపారు. కాగా జయరాంనాయక్ పై చదువుల కోసం జర్మనీ వెళ్లాల్సి ఉండగా అంతలోనే ఇలా జరిగిందని తల్లిదండ్రులు, బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు.


