పత్తి రైతుకు ని‘బంధనాలు’ | - | Sakshi
Sakshi News home page

పత్తి రైతుకు ని‘బంధనాలు’

Dec 4 2025 8:41 AM | Updated on Dec 4 2025 8:41 AM

పత్తి రైతుకు ని‘బంధనాలు’

పత్తి రైతుకు ని‘బంధనాలు’

సీసీఐ కేంద్రాల వద్ద గంటల తరబడి ఎదరుచూపులు థంబ్‌ వేయడం కోసం సాయంత్రం వరకు నిరీక్షణ బిల్లు కోసం మరుసటి రోజు రావాలని సీసీఐ అధికారుల ఆదేశాలు అమ్మకానికి రెండు రోజులు.. ధర ప్రకటన, బిల్లు కోసం మరొక రోజు తేమ లేకున్నా 9.5 నుంచి 11.5 శాతం వరకు మిషన్‌ చూపడంతో ధరలో కోత

ఆదోని అర్బన్‌: మద్దతు ధరతో పత్తి కొనుగోలుకు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ)ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. నిబంధనల పేరుతో గిట్టుబాటు ధర ఇవ్వకుండా నెమ్ము అనే పేరుతో సీసీఐ అధికారులు ధరలో కోతలు వేస్తున్నారు. ఆదోని పట్టణంలో పది సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఇవీ ఇబ్బందులు..

● సీసీఐ కేంద్రంలో పత్తి దిగుబడులు అమ్ముకోవడానికి రైతు సేవా కేంద్రంలో, యాప్‌లో నమోదు చేసుకోవాలి. సర్వర్‌ డౌన్‌తో యాప్‌ కూడా ఓపెన్‌ కాకపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు.

● రైతుల్లో 90 శాతం మందికి సాంకేతికతపై అవగాహన లేదు. అవగాహన కల్పించాల్సిన అధికారులు తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

● యాప్‌ ద్వారా స్లాట్‌ బుక్‌ అయితే అమ్ముకోవడానికి ఒక తేదీని ప్రకటిస్తారు. ఆరోజునే రైతులు పత్తి దిగుబడులను తీసుకెళ్లి అమ్ముకోవాలి.

● స్లాట్‌ బుక్‌ అయిన రోజున వెళ్లాలంటే రైతులు ఒకరోజు ముందుగానే సీసీఐ కేంద్రం దగ్గరకు పత్తిని తీసుకెళ్లాలి. వాహనాన్ని నిలబెట్టుకుని పడిగాపులు కాయాల్సిందే.

● తేమను తనిఖీ చేసి అన్‌లోడ్‌ చేసేందుకు పంపుతారు. అన్‌లోడ్‌ అయిన వెంటనే వేలి ముద్ర వేయాలంటే సాయంత్రం వరకు రైతు వేచి ఉండాల్సిందే.

● వాహనానికి రెండు రోజుల బాడుగ ఇవ్వాల్సి వస్తోంది.

● వేలి ముద్ర వేసిన వెంటనే ధర ప్రకటన, బిల్లు కో సం మరుసటి రోజు రావాలని సీసీఐ అధికారులు ఆ దేశిస్తారు. దీంతో రైతులు మరుసటి రోజు వస్తే కూ డా సాయంత్రం వరకు పడిగాపులు కాయాల్సిందే.

● మూడు రోజులపాటు రోడ్డుపైన, సీసీఐ కేంద్రం వద్ద రైతులు నిరీక్షించాల్సి వస్తోంది.

తేమ చూపుతూ మోసం!

ఈ ఏడాది ఖరీఫ్‌లో 2,49,316 మంది రైతులు 6,93,635 ఎకరాల్లో పత్తి సాగు చేశారు. కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీసీఐ) మద్దతు ధరతో పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే సమయానికి 60 శాతం మంది రైతులు మొదట తీసిన పత్తిని తక్కువ ధరకే అమ్మేసుకున్నారు. మిగిలిన పత్తినైనా మద్దతు ధరతో అమ్ముకోవాలనే లక్ష్యంతో ఉన్నారు. అయితే మిషన్‌తో తేమను చూపుతూ మోసం చేస్తున్నారు. రైతు పత్తి దిగుబడుల వాహనాన్ని సీసీఐ కేంద్రాల వద్ద రోడ్డుపై నిలబెడితే సీసీఐ అధికారులు తేమ శాతం కోసం మిషన్‌ను ఉపయోగిస్తారు. తేమ లేకున్నా అది 9.5 శాతం నుంచి 11.5 శాతం వరకు చూపుతుంది. జిల్లాలో పండించిన పత్తి పొడుగు పింజ రకానిదే. దీనికి మద్దతు ధర రూ.8,110. తేమ 8 శాతం లోపు ఉంటేనే ఈ మద్దతు ధర లభిస్తుంది. తేమ 9 శాతం ఉంటే మద్దతులో ధరలో ఒక్క శాతం తగ్గుతుంది. ఇలా 12 శాతం వరకు అనుమతిస్తారు. 12 శాతం వరకు ఉంటే మద్దతు ధరలో రూ.324.40 తగ్గుతుంది.

ఇదీ రైతుల అభిప్రాయం..

ఆదోని వ్యవసాయ మార్కెట్‌యార్డులో గరిష్ట ధర రూ.7500 ధర పలుకుతోంది. తేమ శాతం, రెండు రోజుల బాడుగతో కలిపితే యార్డులోనే అమ్ముకోవడం మంచిది కదా అని రైతులు పేర్కొంటున్నారు.

సీసీఐ కేంద్రం రైతులకు రూ.8110 గిట్టుబాటు ధర కల్పించింది. అయితే సీసీఐ అధికారులు తేమ మిషన్‌ పెట్టడంతో చాలామందికి ఈ ధర లభించడం లేదు.

సీసీఐ అధికారులు తేమ శాతం తనిఖీ చేసినా అన్‌లోడింగ్‌ వద్ద హమాలీలు తడి ఉందని, నాణ్యత సరిగా లేదని చెబుతున్నారు. మళ్లీ తేమ శాతాన్ని తగ్గించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

తేమ, నాణ్యత అంటూ ధరల్లో కోతలు విధిస్తున్నారు. మళ్లీ పత్తిని ఇంటికి తీసుకెళ్లి మద్దతు ధర కోసం రైతులు చాలా పడిగాపులు కాస్తున్నారు.

చేతివాటం

రైతులు తెచ్చిన పత్తి దిగుబడుల వాహనాల్లో కొంచెం తేడా వచ్చినా సీసీఐ అధికారులు ఆ వాహనాన్ని వెనక్కి పంపుతున్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా కలెక్టర్‌ సిరి రైతులను వెనక్కి పంపరాదని సీసీఐ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సీసీఐ అధికారులు తేమ శాతం, క్వాలిటీ సరిగా లేదంటూ కోతలు వేస్తున్నారు. అంతేగాకుండా కొన్ని ఫ్యాక్టరీలలో పత్తి క్వాలిటీ ఎలాగున్నా హమాలీలకు చేతివాటం ఇస్తే చాలు, అన్‌లోడ్‌ అయిపోయినట్లేనని విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement