అంగన్‌వాడీ టీచర్‌ను తొలగించాలి
కోడుమూరు రూరల్: గోరంట్ల గ్రామంలోని అంగన్‌వాడీ సెంటర్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ ఎ.సిరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంగన్‌వాడీ సెంటర్ టీచర్‌ను వెంటనే విధులనుంచి తప్పించాలని ఐసీడీఎస్ పీడీ విజయ్‌ను అదేశించారు. రికార్డులు, విదార్థుల హాజరు, నిర్వహణ సరిగా లేకపోవడంపై సిబ్బంది పనితీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే గ్రామంలో పారిశుద్ధ్యం లోపించడంపై ఎంపీడీఓ రాముడు, పంచాయతీ కార్యదర్శిపై జిల్లా కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. పొలాలను కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నా రైతులకు రుణాలు ఇప్పించాలని అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట కోడుమూరు తహసీల్దార్ నాగరాజు, ఐసీడీఎస్ సీడీపీఓ వరలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీఓ మంజుల తదితరులున్నారు.
నిరవధిక దీక్షలు
ఎమ్మిగనూరుటౌన్: లెదర్ సొసైటీ ఆస్తులను కాపాడిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఎమ్మిగనూరు పట్టణంలోని సోమప్ప సర్కిల్ వద్ద షేర్‌హోల్డర్లు నిరధిక దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా షేర్ హోల్డర్లతో న్యూలైఫ్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సామెల్, డీవైఎఫ్‌ఐ నాయకులు అజిత్‌కుమార్, జైభీం ఎంఆర్‌పీఎస్ నాయకులు ముత్తుసుమాల తదితరులు మాట్లాడారు. సొసైటీలో చనిపోయిన షేర్ హోల్డర్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు స్థానం కల్పించాలన్నారు. అసలైన షేర్ హోల్డర్లకు న్యాయం చేయాలని, సొసైటీకి సంబంధం లేని వారి పేర్లను సొసైటీ జాబితా నుంచి తొలగించాలని కోరారు. లెదర్ సొసైటీని అడ్డు పెట్టుకొని బడాబాబులు చీకటి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు.
ఐదుగురు ఈఓలకు పదోన్నతి
కర్నూలు కల్చరల్: దేవాదాయ శాఖలో గ్రేడ్–2 ఈఓలుగా విధులు నిర్వహిస్తున్న ఐదుగురికి గ్రేడ్–1 ఈఓలుగా పదోన్నతి కల్పిస్తూ ఆ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కడప జిల్లా వేంపల్లె మండలం వృషభ చలమేశ్వర స్వామి ఆలయం ఈఓగా విధులు నిర్వహిస్తున్న టి.హనుమంతరావు, పలమనేరు గ్రూప్ టెంపుల్స్ ఈఓగా విధులు నిర్వహిస్తున్న కె.కమలాకర్, ఓర్వకల్లు గ్రూప్ టెంపుల్స్ ఈఓగా విధులు నిర్వహిస్తున్న బి.చంద్రశేఖర్ రెడ్డి, కాల్వబుగ్గ ఈఓగా విధులు నిర్వహిస్తున్న టి.మద్దిలేటి, వెంకాయపల్లె రేణుక ఎల్లమ్మ, నాగలాపురం సుంకులా పరమేశ్వరి దేవాలయాల ఈఓగా విధులు నిర్వహిస్తున్న పీఎన్ రాధాకృష్ణలకు గ్రేడ్–1 ఈఓలుగా పదోన్నతి లభించింది. త్వరలోనే వీరికి నూతన దేవాలయాలను కేటాయించనున్నారు.
దివ్యాంగుల్లో ప్రతిభను వెలికి తీయాలి
వెల్దుర్తి: దివ్యాంగుల్లో ప్రతిభను వెలికి తీయాలని ఏపీ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర చైర్మన్ పద్మాకర్ అన్నారు. స్థానిక భవిత కేంద్రంలో బుధవారం 66వ అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం నిర్వహించారు. ఇటీవలి కర్నూలులో జరిగిన పారా స్పోర్ట్స్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులను అభినందిస్తూ ప్రోత్సాహకాలందించారు. ఎంఈఓ ఇందిర, హెచ్‌ఎంలు జాన్‌పాల్, సరస్వతి పాల్గొన్నారు.
చిరుతపులి గోర్ల మాయంపై విచారణ
● ఆరుగురిని అదుపులోకి తీసుకున్న
అధికారులు
మహానంది: ఎంసీ ఫారం గ్రామం సమీపంలో గతంలో చిరుతపులి గోర్లను మాయం చేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు దర్యాప్తు ము మ్మరం చేశారు. గోపవరం, ఎంసీ ఫారం, నంద్యాల, మహానంది గ్రామాలకు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు బుధవారం రాత్రి తెలిసింది. వీరిలో అటవీ శాఖ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న తాత్కాలిక చిరుద్యోగి ఉండటం చర్చనీయాంశమైంది. చిరుతపులి గోర్లను సేకరించిన వారితో పాటు కొనుగోలు చేసిన వారిని సైతం అదుపులోకి తీసుకున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.
అంగన్‌వాడీ టీచర్‌ను తొలగించాలి


