కల్లాల్లో ధాన్యం... కళ్లల్లో దైన్యం!
ఈయన పాములపాడుకు చెందిన రైతు పక్కీరయ్య. సొంతంగా మూడు ఎకరాలతో పాటు మరో ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న సాగు చేశాడు. ఎకరాకు రూ.25 వేల వరకు పెట్టుబడి పెట్టాడు. కౌలుకు తీసుకున్న భూమికి రూ.40 వేలు అదనం. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పంట దెబ్బతిని ఎకరాకు 19 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. నెల రోజుల క్రితం కోతలు పూర్తయ్యాయి. మద్దతు ధరకు ప్రభుత్వం కొంటుందేమోనని ఆశతో ఎదురుచూశాడు. సర్కారు స్పందించకపోవడంతో క్వింటాల్ రూ.1800 చొప్పున 95 క్వింటాళ్లు విక్రయించాడు. మరో 110 క్వింటాళ్లను గోదాముల్లో భద్రపరుచుకున్నాడు.
సాక్షి, నంద్యాల: ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు ఆచరణకు పొంతనే కుదరడం లేదు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని 10 రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కావడం లేదు. ఉత్తుత్తి ఆదేశాలు కాదు పేపరు మీద ఆర్డర్స్ ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఓ వైపు ప్రకృతి సహకరించక దిగుబడులు తగ్గితే మరోవైపు సర్కారు నుంచి మద్దతు ధర లభించని పరిస్థితి. కష్టాల్లో ఉన్న రైతులను ఉదారంగా ఆదుకోకపోగా వేడుక చూస్తుండటంతో మొక్క జొన్న రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
జిల్లాలో 55 వేల హెక్టార్లలో సాగు
జిల్లాలోని 29 మండలాల పరిధిలో 55 వేల హెక్టార్లలో మొక్కజొన్న పంటను రైతులు సాగు చేశారు. అత్యధికంగా నందికొట్కూరు నియోజకవర్గంలో 28,460 హెక్టార్లలో పంట పండించారు. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. వాతావరణం అనుకూలిస్తే 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది అతివృష్టితో విపరీతంగా వర్షాలు పడడంతో ఎకరాకు 18 క్వింటాళ్లకు మించి దిగుబడి రాలేదు. పంట కోసిన తర్వాత కూడా మోంథా తుపాను విజృంభించడంతో తీవ్రంగా నష్టపోయారు. గింజలు ఆరేసుకోవడానికి గోదాములు లేక రోడ్లమీదే వేస్తున్నారు. వర్షం వచ్చినప్పుడల్లా పట్టలు కప్పుకుని నీరు ఎత్తుపోసుకుంటూ అష్టకష్టాలు పడుతున్నారు.
ఇథనాల్ రేటు పెరిగినా..
పెట్రోల్‌లో ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియకు కేంద్రం ప్రాధాన్యమిస్తోంది. లీటర్ పెట్రోల్‌లో దాదాపు 20 శాతం ఇథనాల్ ఉండేలా కేంద్రం ఇప్పటికే చర్యలు చేపట్టింది. దీంతో ఇథనాల్ తయారీ పెరిగింది. మొక్కజొన్న ఆధారంగా తయారుచేసే ఇథనాల్ ధర 2021–22లో లీటర్ రూ.53 ఉండగా అది ఇప్పటికి రూ.72కి పెరిగింది. అయినా, రైతులకు ఇచ్చే మద్దతు ధర పెరగడం లేదు. క్వింటాల్‌కి ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 2,400 ఉంటే ప్రస్తుతం ధర రూ.1500 నుంచి 1800 మధ్య పలుకుతోంది.
క్వింటాల్‌కు రూ.800 వరకు నష్టం
గతంలో ఎప్పుడూ లేనివిధంగా పెట్టుబడి ఖర్చులు పెరిగాయి. కానీ ధరలు మాత్రం ఆ స్థాయిలో ఉండడం లేదు. అప్పులు చేసి సాగు చేసిన రైతులు వడ్డీల భయంతో ఉన్న ధరకే విక్రయించేస్తున్నారు. రైతుల కష్టాలను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు వారిని నిలువునా ముంచేస్తున్నారు. జిల్లాలో 90 శాతం పంట కోతలు పూర్తయ్యాయి. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఒక్కో రైతు ఒక్కో క్వింటాల్ మీద రూ.800 వరకు నష్టపోతున్నారు. ఇంత భారీగా రైతుల నడ్డివిరుస్తున్నా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు. 10 రోజుల క్రితం సీఎం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పినా క్షేత్రస్థాయిలో ఎవరూ పట్టించుకోవడం లేదు.
కలెక్టర్‌కు నిరసన సెగ
జిల్లాలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలపై నెల రోజుల క్రితం జాయింట్ కలెక్టర్ బత్తుల కార్తీక్ మార్క్‌ఫెడ్‌తో పాటు వ్యవసాయశాఖాధికారులతో సమావేశం నిర్వహించి చర్చించారు. కానీ, ఇప్పటివరకు కేంద్రాలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో విసుగెత్తిపోయిన రైతులు కలెక్టర్ రాజకుమారి ఎదుటే తమ నిరసన వ్యక్తం చేశారు. పింఛన్ల పంపిణీలో భాగంగా నంద్యాల రూరల్ మండలం భీమవరం గ్రామానికి వెళ్లిన కలెక్టర్‌ను అడ్డుకుని నిలదీశా రు. పంటనంతా వ్యాపారులకు విక్రయించిన తర్వాత కేంద్రాలు ప్రారంభిస్తే తమకు ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. రైతులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక కలెక్టర్ అక్కడి నుంచి వెనుదిరగడం గమనార్హం.
మొక్కజొన్న రైతు గోడు పట్టించుకోని
చంద్రబాబు ప్రభుత్వం
పదిరోజుల క్రితం కొనుగోల ప్రకటన
నేటికీ ఆచరణకు నోచుకోని వైనం
కలెక్టర్‌ను నిలదీసిన రైతులు
కల్లాల్లో ధాన్యం... కళ్లల్లో దైన్యం!


