
ఖరీఫ్‌కు సిద్ధమవుదాం
● లోతు దుక్కులతో ఎన్నో ఉపయోగాలు ● పొలాల్లో గొర్రెలు మంద కట్టడం వల్ల సేంద్రియ పదార్థం పెరుగుదల ● నేల గుల్ల బారుతుంది.. సకాలంలో విత్తనం వేసుకోవచ్చు ● కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ సాలురెడ్డి సూచనలు
కర్నూలు అగ్రికల్చర్: వేసవి.. పొలాల్లో పంటలు లేని సమయం. అతి ముఖ్యమైన పొలం పనులు చేపట్టాల్సింది వేసవిలోనే. తొలకరితో మొదలయ్యే ఖరీఫ్ సీజన్‌కు ఇప్పటి నుంచే సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది. వేసవిలో చేపట్టే పొలం పనులను బట్టే పంటల పెరుగుదల, దిగుబడులు వస్తాయి. వేసవిలో చేపట్టాల్సిన పనులను కర్నూలు సబ్ డివిజన్ ఏడీఏ సాలురెడ్డి వివరించారు.
లోతు దుక్కులు
ఇటీవల జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అకాల వర్షాలు కురిశాయి. ప్రస్తుతం దుక్కులు చేసుకోవడానికి సరిపడా తేమ ఉన్న పొలాల్లో ట్రాక్టర్లు లేదా ఎద్దుల నాగళ్లతో లోతు దుక్కులు దున్నాలి. దుక్కుల లోతు సుమారుగా 9 అంగుళాలకు తగ్గకుండా ఉండాలి. అలా లోతు దుక్కులు చేసినప్పుడు పలు రకాల ప్రయోజనాలు చేకూరుతాయి. వాలుకు అడ్డంగా దున్నుకోవడం అవసరం. వర్షాలు తగ్గినందున వాలుకు అడ్డంగా దున్నుకోవడం వల్ల వర్షపు నీరు భూమిలోకి బాగా ఇంకిపోతుంది.
నేలలోని చీడ పీడలు నశిస్తాయి
లోతు దుక్కులు దున్నినప్పుడు నేలపై పొరల్లో ఉండే పురుగులు, తెగుళ్లను నశింపజేయడానికి అవకాశం ఉంది. నేలను లోతుగా దున్నినప్పుడు నేలలో దాక్కునే లేదా నిద్రావస్థలో ఉంటే పురుగులు, నేలలో ఉండి తెగుళ్లను కలగజేసే శిలీంద్రాలు ఎండల బారిన పడి నశిస్తాయి. అందువల్ల వేసవిలో పొలాలను లోతు దుక్కి చేసుకుంటే తొలకరిలో విత్తుకునే పంటకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
నేల గుల్లబారుతుంది
వేసవిలో లోతుగా దుక్కి దున్ని తొలకరి వర్షాలకు గొ ర్రు తిప్పి గుంటలతో సేద్యం చేస్తే వేర్లు బాగా విస్తరించడానికి అనుకూలంగా ఉంటుంది. నేల అధికంగా నీటిని పీల్చుకుంటుంది. సేద్యానికి ఉపయోగించే గొర్రు, గుంటక, దంతె వంటి పరికరాలు నేల లోపలికి 3–5 అంగుళాల లోతు వరకు చొచ్చుకొనిపోతాయి. ఈ పరికరాలను ఉపయోగించి పదే పదే సేద్యం చేయడం వల్ల నేల లోపల సుమారుగా 3–5 అంగుళాల లోతులో ఒక గట్టి పొర ఏర్పడుతుంది. అందువల్ల నేలకు నీటిని పీల్చుకునే శక్తి తగ్గుతుంది. కావున నేలను లోతుగా దున్నినప్పుడు ఈ గట్టి పొర ఛేదింపబడి నేలకు నీటిని పీల్చుకునే శక్తి అధికమవుతుంది.
సేంద్రియ పదార్థం నేలలో కలుస్తుంది...
పంటల కోతల తర్వాత నేలపై మిగిలే పంటల మొదళ్లు పొలంలో మిగిలిన కలుపు మొక్కలు, పంటల నుంచి రాలిపడిన ఆకులు వంటి వివిధ సేంద్రియ పదార్థాలన్నీ లోతు దుక్కి దున్నినప్పుడు నేలలో కలిసి కుళ్లిపోతాయి. అందువల్ల నేలలో సేంద్రియ పదార్థాలు, పోషక విలువలు పెరగడానికి అవకాశం ఉంది.
పశువుల ఎరువులను తోలడం
సంవత్సరం పొడవునా నిల్వ చేసిన పశువుల ఎరువులను ఎండాకాలంలోనే పొలాల్లోకి తోలా లి. వర్షాలు పడిన తర్వాత పొలాలకు తోలిన పశువుల ఎరువులను నేలపై చల్లి లోతు దుక్కి దున్నితే మట్టిలో బాగా కలుస్తుంది. దీనివల్ల పంటలకు అవసరమైన పోషకాలు అందుతాయి.
వేసవి దుక్కులు చేస్తున్న దృశ్యం
పశువులు/గొర్రెలు మందకట్టడం
ఈ పని కూడా రైతులు వేసవిలో చేసుకోవచ్చు. లోగడ ప్రతి రైతుకు ఎద్దులు, ఆవులు, గేదెలు ఉండేవి. వాటిని రాత్రిళ్లు పొలంలో కట్టేసేవారు. వాటి మల మూత్రాలు పొలానికి తిన్నగా చేరి పంటలకు ఉపయోగపడేవి. ఇందువల్ల ఎరువుల ఖర్చు తగ్గేది. ఇప్పుడు పాంచకట్టేసే పశుగణాలు తగ్గిపోయాయి. పశుగణం ఎక్కువగా ఉండే గ్రామాల్లో ఈ పని ఇప్పటికై నా చేయవచ్చు. గొర్రెలను పొలంలో మందకట్టడం రైతులకు పరిపాటే. ఈ పని ఎండాకాలంలోనే చేయాలి. నిద్రలో ఉన్న గొర్రెల మందలను రాత్రిళ్లు ఎక్కువసార్లు లేపితే ఎక్కువసార్లు పెంటికలను వేస్తాయి. దీనివల్ల చేనుకు అవసరమైనంత గొర్రెల ఎరువు, మూత్రం లభ్యమవుతుంది. ఇలా నేలకు సేంద్రియ ఎరువులను అందించవచ్చు.
మొండిజాతి కలుపు నివారణ
తుంగ, గరిక, దర్బ వంటి మొండిజాతి కలుపు మొక్కలు పొలంలో పెరిగి పంటలకు నష్టం కలగజేస్తుంటాయి. వీటి వేర్లు, కాయలు, దుబ్బులు నేలలో బాగా విస్తరించి ఉండటం వల్ల నివారణ కష్టం అవుతుంది. పంటలు వేసినప్పుడు వాటితో పాటు పెరిగి నష్టం కలగచేస్తాయి. వేసవిలో దుక్కి బాగా దున్నినప్పుడు ఈ కలుపు మొక్కల కాయలు, వేర్లు దుంపలు పెకలింపబడి, వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రతలకు నశించడానికి అవకాశం ఉంటుంది. నేలపైకి తేలిన కాయలు, వేర్లు దుంపలను ఏరివేసి వీటిని అరికట్టవచ్చు.