
పల్లెకు రాని ‘వెలుగు’
బస్సులు వెళ్లని గ్రామాల సంఖ్య..
మండలం బస్సు వెళ్లని
గ్రామాలు
కృష్ణగిరి 28
వెల్దుర్తి 27
తుగ్గలి 37
పత్తికొండ 8
మద్దికెర 6
కృష్ణగిరి: గ్రామీణ ప్రాంతాలకు ‘పల్లె వెలుగు’ బస్సులు వెళ్లడం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీధిలేని పరిస్థితుల్లో ఆటోల్లో ప్రయాణించాల్సి వస్తోంది. పత్తికొండ నియోజకవర్గంలోని ఐదు మండలాలు ఉండగా.. మొత్తం 106 గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. కేవలం 65 గ్రామాలకు మాత్రమే రోజుకు ఒకటి, రెండు ట్రిప్పుల చొప్పున బస్సులు నడుస్తున్నాయి. ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించడానికి ద్విచక్ర, ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తూ ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు.
ఇదీ దుస్థితి..
● గతంలో డోన్ నుంచి కంబాలపాడు, వెల్దుర్తి, కోడుమూరు నుంచి పలు బస్సు సర్వీసులు కృష్ణగిరికి ఉండేవి. నేడు కర్నూలు జిల్లాలో బస్సు సౌకర్యం లేని మండల కేంద్రంగా కృష్ణగిరి నిలిచింది. ప్రజలకు ఆటోలే శరణ్యమయ్యాయి.
● పత్తికొండ నియోజవర్గంలోని దాదాపుగా అన్ని గ్రామాలకు తారు రోడ్డు సౌకర్యం ఉన్నా బస్సు సౌకర్యాలు లేవు.
● రామకృష్ణాపురం, ఎస్‌హెచ్ ఎర్రగుడి, మన్నెకుంట, జి.మల్లాపురం, ఎరుకల చెరువు, పోతుగల్లు, పెనుమాడ, కంబాలపాడు, అమకతాడు, కర్లకుంట, తొగర్చేడు, టి.గోకులపాడు, బోయబొంతిరాళ్ల, ఆలంకొండ, కటారుకొండ, పెద్దొడ్డి, గుడెంపాడు, బాపనదొడ్డి, పుట్లూరు తదితర గ్రామాలకు చెందిన రెండు వేల మంది ప్రజలు డోన్, వెల్దుర్తి, కోడుమూరు ప్రాంతాలకు వెళ్లడానికి ఆటోలను ఆశ్రయిస్తున్నారు.
● వెల్దుర్తి మండలంలోని చిన్న కులుములపల్లె, శ్రీరంగాపురం, లక్ష్మింపల్లె, చెర్లకొత్తూరు. గోవర్ధనగిరి, కొట్టాల, పేరేముల, ఎల్.నగరం, బింగిదొడ్డి, ఎల్ తాండ, కాశాపురం, సూదాపల్లె, బోగోలు, గువ్వలకుంట, గుంటుపల్లి, అల్లుగుండు, మల్లెపల్లె, నార్లాపురం, వెంకటాపురం, బుక్కాపురం, బోయినపల్లె, సర్సాపురం, తిమ్మాపురం, పిక్కిలివానిపల్లె, బాలాపురం, లింగాలపల్లె, కొసనాపల్లె, మంగంపల్లె గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.
● తుగ్గలి మండలంలో 37, మద్దికెర మండలంలో 6 గ్రామాలకు, పత్తికొండ మండలంలో కూడా పుచ్చకాయలమాడ, అటికెలగుండు, కొత్తపల్లి, చక్రాళ్ల, కురవలదొడ్డి, పెద్దహుళ్తి, కోతిరాళ్ల, నలకదొడ్డి గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు.
ప్రయాణం.. ప్రమాదకరం
బస్సులు లేని కారణంగా భద్రతలేని ఆటోల్లో ప్రయాణించడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏడాది కాలంలో పత్తికొండ నియోజకవర్గంలో చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆటోల్లో, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురై 20 మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది క్షతగాత్రులయ్యారు. ఆటో ప్రయాణం ప్రమాదమని తెలిసినా విధిలేని పరిస్థితుల్లో వాటిపైనే ఆధారపడాల్సి వస్తుందని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పాఠశాలలకు విద్యార్థులు సైతం ఆట్లోనే వెళ్లుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాల్లో విషాదం నెలకొననుంది.
ఆర్టీసీ బస్సుల్లేక
గ్రామీణ ప్రజల అవస్థలు
ఆటోల్లో కిక్కిరిసి ప్రయాణం
తరచూ ప్రమాదాలు

పల్లెకు రాని ‘వెలుగు’